
హైదరాబాద్, వెలుగు: గ్రామాభివృద్ధి కమిటీ(వీడీసీ)ల పేరుతో కొందరిని సోషల్ బాయ్ కాట్ చేయడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఈ చర్యలను ఆదిలోనే అంతం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేకపోతే ఇదే తరహా చర్యలు ఇతర ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఘటనపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సోషల్ బాయ్‌కాట్‌కు కారణమైన తొమ్మిది మందికి కూడా నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలానికి చెందిన ఎ.శంకర్ గౌడ్ తోపాటు మరో నలుగురి బహిష్కరణపై వీడీసీ నిర్ణయం అమలును అడ్డుకోవాలని జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్లను హైకోర్టు ఆదేశించింది. జక్రాన్‌పల్లికి చెందిన శంకర్ గౌడ్ మరో నలుగురు తమను వీడీసీ గ్రామ బహిష్కరణ చేయడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు.
వాళ్ల తరఫు లాయర్ వి.మల్లిక్ వాదనలు వినిపిస్తూ ఎక్సైజ్ శాఖ పర్మిషన్ తీసుకుని కల్లు తీసేందుకు వెళ్తే కమిటీ అడ్డుకుందని, రూ.10 లక్షలు ఇవ్వాలని కోరితే ఇవ్వకపోతే తమ వర్గం వారందరినీ కల్లుగీత చేపట్టకుండా సామాజికంగా బహిష్కరిస్తున్నట్లు కమిటీకి చెందిన 9 మంది ప్రకటించారని చెప్పారు. గ్రామస్తులెవరూ తమకు సహకరించరాదని, ఒకవేళ ఎవరైనా సహకరిస్తే రూ.10 వేల నుంచి రూ.25 వేలు జరిమానా విధిస్తామని కమిటీ నిర్ణయించిందన్నారు. ఫలితంగా తమ జీవనోపాధి దెబ్బతిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని ప్రభుత్వ లాయర్ చెప్పారు. ఆ ఘటనపై సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. కమిటీలో వాళ్లను కూడా ఎడ్యుకేట్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.