బాలల హక్కుల కమిషన్‌‌ రూల్స్‌‌పై రిట్‌‌ : హైకోర్టు

బాలల హక్కుల కమిషన్‌‌ రూల్స్‌‌పై రిట్‌‌ : హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: బాలల హక్కుల కమిషన్‌‌ చైర్మన్, మెంబర్స్‌‌ నియామక అర్హతల నిబంధనలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌‌ దాఖలు చేయాలని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. ఆ పదవులకు కనీసం పదేండ్ల అనుభవం ఉండాలన్న నిబంధనను అఖిల్‌‌ శ్రీగురుతేజ హైకోర్టులో సవాల్‌‌ చేశారు.

దీనిని చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ జె. అనిల్‌‌ కుమార్లతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ గురువారం విచారించింది. బాలల హక్కుల కమిషన్‌‌ చైర్మన్‌‌ సభ్యుల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 25న నోటిఫికేషన్‌‌ జారీ చేసిందని పిటిషనర్‌‌ లాయర్‌‌ చెప్పారు. 2015 నాటి నిబంధనల ప్రకారం శిశుసం క్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి,  బాలల నేర న్యాయం, అనాథలు, వికలాంగులు, బాల కార్మికులు తదితర రంగాల్లో సంక్షేమంపై 10 ఏళ్ల అనుభవం ఉండాలన్న నిబంధనను కొట్టేయాలని కోరారు. ఈ నిబంధన ఏకపక్షం, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని కోర్టుకు విన్నవించారు. వాదనల తర్వాత ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు..విచారణను వాయిదా చేసింది.