- ముగ్గురు ఐఏఎస్‌లకు హైకోర్టు నోటీసులు
- ఇలాగైతే భూసేకరణ ప్రక్రియ ఆపేస్తామని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సీసీఎల్‌ఏ లోకేశ్ కుమార్కు హైకోర్టు.. ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. వనపర్తిలో శంకర్‌సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కాలువ తవ్వకం నిమిత్తం 2013లో సేకరించిన భూమికి పరిహారంలో 50 శాతం డిపాజిట్ చేయాలని ఆదేశాలిచ్చినా అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇలాగైతే పరిహారం బకాయిలు చెల్లించకుండా భవిష్యత్తులో ఎలాంటి భూసేకరణ చేపట్టరాదని ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. 50 శాతం డిపాజిట్ చేయడానికి పలు అవకాశాలిచ్చినా కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోగా మళ్లీ గడువు కోరడాన్ని తప్పుపట్టింది. ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో ఫిబ్రవరి 2న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. పరిహారంలో 50 శాతం చెల్లించాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై భూమిని కోల్పోయిన వనపర్తి జిల్లా పంగల్ మండలానికి చెందిన సుమారు 60 మందికిపైగా రైతులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్ కుమార్ సోమవారం విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పరిహారంలో 50 శాతం డిపాజిట్ చేయాలని గత ఏడాది ఏప్రిల్ 29న ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 8 నెలలుదాటినా పరిహారం సొమ్ము డిపాజిట్ చేయలేదన్నారు. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కౌంటరు దాఖలు చేస్తూ నీటిపారుదల శాఖ నుంచి ఎలాంటి ఫైలు అందలేదని, అందిన వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తామనగా, ప్రభుత్వ వివరణ చెప్పడానికి గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది అడగటంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తీసుకున్న భూములకు పరిహారం చెల్లించలేకపోతే కొత్తగా భూసేకరణ ఎలా చేపడతారని.. వారికి పరిహారం ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. కోర్టు ఉత్తర్వుల అమలుకు అవకాశాలు ఇచ్చినా స్పందించకపోవడంతో కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు చేపట్టరాదో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ ముగ్గురు ఐఏఎస్‌లకు ఫాం-1 నోటీసులు జారీ చేశారు.
