వీ6–వెలుగు పిటిషన్​పై హైకోర్టు కీలక ఆదేశాలు

వీ6–వెలుగు పిటిషన్​పై హైకోర్టు కీలక ఆదేశాలు
  • ఆ కంపెనీ వార్తలు రాయొద్దన్న ఖమ్మం కోర్టు ఇంజంక్షన్​ ఆర్డర్​ రద్దు
  • మన రాష్ట్రానికి మేఘా చేస్తున్న దగాను వరుసగా బయటపెట్టిన వీ6–వెలుగు
  • మీడియాలో, సోషల్‌ మీడియాలో తమ కథనాలు రాకుండా ఫిబ్రవరి 11న ఆర్డర్​ తెచ్చుకున్న కంపెనీ
  • దాన్ని హైకోర్టులో సవాల్​ చేసిన వీ6– వెలుగు సీఈవో, చీఫ్​ ఎడిటర్​ అంకం రవి
  • ఇంజంక్షన్​ ఆర్డర్​ పత్రికా స్వేచ్ఛను కాలరాసేలా ఉందని వాదన
  • పిటిషనర్​ వాదనను సమర్థించిన డివిజన్​ బెంచ్.. 
  • కింది కోర్టు ఉత్తర్వుల సస్పెన్షన్​
  • ప్రాథమిక హక్కులకు, రాజ్యాంగానికి వ్యతిరేకం

ప్రాథమిక హక్కులు, వాక్‌ స్వాతంత్య్రం, రాజ్యాంగ అధికరణలకు ఖమ్మం జిల్లా కోర్టు ఉత్తర్వులు వ్యతిరేకంగా ఉన్నాయని, రాజ్యాంగంలోని 14, 19, 21 అధికరణలకు వ్యతిరేకమన్న పిటిషనర్​ వాదనను హైకోర్టు ఆమోదించింది. మేఘా కంపెనీ తరఫు న్యాయవాది కల్పించుకొని.. కింది కోర్టు ఇచ్చిన ఇంజంక్షన్‌ ఆర్డర్‌ను సస్పెండ్‌ చేయాల్సిన అవసరం లేదన్నారు. సస్పెండ్‌ చేస్తే ఈరోజు నుంచే తమ కంపెనీకి వ్యతిరేకంగా వార్తా కథనాలు వస్తాయని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ‘‘ఒక సంస్థకు సంబంధించిన ఏ వార్తను కూడా రాయరాదన్న, టీవీల్లో ప్రసారం చేయరాదన్న ఉత్తర్వులను ఎలా ఆమోదించగలం?” అని ప్రశ్నించింది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే కింది కోర్టులో చెప్పుకోవాలని స్పష్టం చేస్తూ.. ఖమ్మం జిల్లా కోర్టు ఇచ్చిన ఇంజంక్షన్‌ ఆర్డర్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. 

హైదరాబాద్​, వెలుగు: మేఘా కాంట్రాక్టు కంపెనీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మీడియా గొంతు నొక్కేలా, ఆ కంపెనీకి అనుకూలంగా ఉన్న ఇంజంక్షన్ ఆర్డర్​ను హైకోర్టు రద్దు చేసింది. తమ కంపెనీకి సంబంధించిన ఎలాంటి కథనాలు పత్రికల్లో ప్రచురించరాదని, టీవీల్లో ప్రసారం చేయరాదని గతంలో ఖమ్మం ఒకటో అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి నుంచి మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ కంపెనీ ఇంజంక్షన్​ ఆర్డర్​ తెచ్చుకుంది. దీన్ని సవాల్​చేస్తూ వీ6 –వెలుగు సీఈఓ, చీఫ్​ ఎడిటర్​ అంకం రవి హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు.

ఇంజంక్షన్​ ఆర్డర్​ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని అందులో పేర్కొన్నారు. ఈ పిటిషన్​ను మంగళవారం విచారించిన హైకోర్టు.. కింది కోర్టు ఇచ్చిన ఇంజంక్షన్​ ఆర్డర్​​ను సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వీ6 టీవీ, వెలుగు డైలీ సహా 30 పత్రికలు, సోషల్‌ మీడియా వేదికల్లో మేఘా కంపెనీపై ఎలాంటి కథనాలు ప్రచురించరాదన్న ఖమ్మం జిల్లా కోర్టు ఉత్తర్వులు పత్రికా స్వేచ్ఛను హరించేలా ఉన్నాయన్న పిటిషనర్​ వాదనను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ షమీమ్‌ అక్తర్, జస్టిస్‌ జువ్వాడి శ్రీదేవితో కూడిన డివిజన్‌ బెంచ్‌  సమర్థించింది. మీడియా గొంతునొక్కే ప్రయత్నాలను తాజా ఆదేశాలతో హైకోర్టు అడ్డుకున్నది. 
పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకం
మేఘా కంపెనీపై ఎలాంటి కథనాలు ప్రచురించరాదంటూ కింది కోర్టు ఇచ్చిన ఇంజంక్షన్‌ ఆర్డర్‌ రాజ్యాంగ విరుద్ధమని, పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకమని పిటిషనర్​ తరఫు హైకోర్టు సీనియర్​ అడ్వకేట్​ ఆర్కాట్​ చంద్రశేఖర్‌ వాదించారు. సదరు ఇంజంక్షన్‌ ఆర్డర్‌ అమల్లో ఉంటే మీడియాపై పూర్తి స్థాయిలో నిషేధం విధించినట్లేనని కోర్టు దృష్టికి ఆయన తీసుకెళ్లారు. ఇలాంటి ఆర్డర్ల​తో ఇక పత్రికలు, టీవీలు పనిచేసే పరిస్థితులు ఉండవని, మూతపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

కింది కోర్టు తీర్పు ఇచ్చేముందు కనీసం ఎక్స్​ పార్టీకి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, ఏకపక్షంగా ఆర్డర్​ విడుదల చేసిందని హైకోర్టుకు పిటిషనర్​ తెలిపారు. ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమే కాకుండా ఆర్టికల్​ 19ఏ ప్రకారం రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాసేలా ఉందని ఆయన వాదించారు. పత్రికా స్వేచ్ఛపై సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాలకు ఖమ్మం జిల్లా కోర్టు ఆర్డర్​ వ్యతిరేకంగా ఉందని, దీన్ని రద్దు చేయాలని కోరారు.
మేఘా బాగోతాలు బయటపెట్టినందుకే..!
ఇటు మన రాష్ట్రంలో కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుతోపాటు ఎన్నో పనుల కాంట్రాక్టులు దక్కించుకొని ప్రయోజనం పొందుతున్న ఆంధ్రా బడా కంపెనీ మేఘా.. అటు మన రాష్ట్రాన్ని ముంచే ఏపీ ప్రాజెక్టులైన సంగమేశ్వరం వంటివి కూడా కడుతూ రెండు దిక్కులా దగా చేస్తున్న తీరును వరుసగా వీ6 వెలుగు బయటపెట్టింది. మన రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టింది. మోసాలను ఫొటోలతో బట్టబయలు చేసింది. ‘మేఘా దగా’, ‘మేఘా ఇది తగునా’, ‘మేఘా అదే ధోకా’, ‘మేఘా చీటింగ్​’ అంటూ అనేక కథనాలు ప్రచురించింది.

తెలంగాణ ప్రాంతంలోని మట్టిని కూడా వదలకుండా రాత్రికి రాత్రి అక్రమంగా  కృష్ణా నదిని దాటిస్తున్న మేఘా జెట్టి బాగోతాన్ని జనానికి తెలియజేసింది. ఇటీవల ఇరిగేషన్‌‌ ప్రిన్సిపల్​ సెక్రటరీ కూతురు పెండ్లి ఖర్చుల బిల్లులను మేఘా కంపెనీ చెల్లించిందని ‘ది న్యూస్​ మినిట్​’ వెబ్​సైట్ బయటపెట్టిన విషయాన్ని కూడా వీ6 వెలుగు ప్రచురించింది. ఇలా వరుసగా తమ నిర్వాకం బయటకు వస్తుండటంతోనే మేఘా కంపెనీ ఖమ్మం జిల్లా కోర్టును ఆశ్రయించి, ఈ ఏడాది ఫిబ్రవరి 11న ఇంజంక్షన్‌‌ ఆర్డర్‌‌ తెచ్చుకుంది. దీన్ని సవాల్‌‌ చేస్తూ వీ6 వెలుగు సీఈవో, చీఫ్​ ఎడిటర్​ అంకం రవి హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు.