
- రాష్ట్రానికి హైకోర్టు నోటీసు
హైదరాబాద్, వెలుగు: కనీస వేతనాల బోర్డు చైర్మన్గా జనక్ ప్రసాద్ నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలై న పిటిషన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్, బోర్డు సభ్యుడు నరసింహారెడ్డికి హైకోర్టు నోటీ సులు జారీచేసింది. జనక్ ప్రసాద్ నియామకంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కనీస వేతనాల బోర్డు చైర్మన్గా జనక్ ప్రసాద్‌ను నిరుడు మార్చిలో ప్రభుత్వం నియమించింది. డిసెంబరులో 12 మంది సభ్యులను నియమించింది. ఐఎన్‌టీయూసీ నుంచి ఎస్.నరసింహారెడ్డి సభ్యుడిగా ఎంపికయ్యారు.
జనక్ ప్రసాద్, నరసింహారెడ్డి నియామకాన్ని సవాలు చేస్తూ ట్రేడ్ యూనియన్ కార్యకర్త శ్రీనివాస్.. హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌ను చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ శామ్‌కోషి ధర్మాసనం గురువారం విచారించింది. పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. కనీస వేతన చట్టం 1948లోని సెక్షన్ 8(2), 9ని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21ను పూర్తిగా ఉల్లంఘించి ప్రభుత్వం చైర్మన్, సభ్యుడి నియామకం చేపట్టిందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను వాయిదా వేసింది.