
- ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో కోర్టులో వాదించిన ప్రభుత్వ తరఫు అడ్వకేట్ ఫిరాయింపులపై స్పీకర్
- తుది నిర్ణయం తీసుకునే వరకు కోర్టులు ఉత్తర్వులు ఇవ్వలేవని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే విషయంలో స్పీకర్‌కు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసే పరిధి చాలా తక్కువగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఖైరతాబాద్, భద్రాచలం, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకటరావు, కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం మరోసారి విచారణ చేపట్టారు.
పార్టీ ఫిరాయింపులపై స్పీకర్‌కు పిటిషన్ అందిన తర్వాత దానిపై స్పీకర్ తుది నిర్ణయం తీసుకునే వరకు కోర్టులు స్పీకర్‌కు ఉత్తర్వులిచ్చే అధికారాల్లేవని, ఈ విషయంపై సుప్రీంకోర్టు గతంలోనే రూలింగ్ ఇచ్చిందని ఏజీ గుర్తుచేశారు. సుప్రీంకోర్టు 1992లో వెలువరించిన తీర్పు ప్రకారం స్పీకర్ తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఉత్తర్వులు జారీకి కోర్టులకు ఆస్కారమే లేదన్నారు. సుప్రీంకోర్టు 1992లో ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం స్పీకర్ పార్టీ ఫిరాయింపుల వివాదాన్ని పరిష్కరించే వరకు హైకోర్టులు ఆ వ్యవహారంపై జోక్యం చేసుకోడానికి వీల్లేదన్నారు.
ఆ తీర్పు తర్వాత ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. తన ముందున్న పార్టీ పియింపుల ఫిర్యాదును స్పీకర్ మూడు నెలల్లోగా పరిష్కరించాలని చెప్పిందన్నారు. ఈ తీర్పును అమలు చేయాలని పిటిషనర్ల న్యాయవాది కోరడం చెల్లదన్నారు. ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం ఉత్తర్వులు ఉండగా.. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఉత్తర్వులు ఆచరణలో ఉండవని పేర్కొన్నారు.
అధికారంలో ఉండగా బీఆర్‌ఎస్ పార్టీలోకి ఇతర పార్టీల ఎమ్మెల్యేలు పిరాయింపు చేయడాన్ని సవాల్ చేసిన కేసులో సుప్రీంకోర్టు.. ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి నివేదించాలని చెప్పిందని గుర్తుచేశారు. అయితే, ఇప్పటికీ ఆ ధర్మాసనం ఏర్పాటు కాలేదని, దీంతో 1992లో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పుకే హైకోర్టు కట్టుబడి ఉండాలన్నారు. లేకపోతే ఐదుగురు న్యాయమూర్తులతో ఫుల్ బెంచ్ ఏర్పాటు చేయాలన్న ఉత్తర్వులు అమలు జరిగి ఆ బెంచ్ తీర్పు వచ్చే వరకు ఫిరాయింపుల వివాదాన్ని పెండింగ్‌లో పెట్టాలని కోరారు.
సర్వాధికారాలు స్పీకర్‌కే...
చట్టసభ నుంచి సభ్యుడి సస్పెన్షన్ లేదా సభ నుంచి శాశ్వత బహిష్కరణ లేదా అనర్హత వేటు వంటి నిర్ణయాలు తీసుకునే వరకు సర్వాధికారాలు స్పీకర్‌కే ఉంటాయని, ఆ విషయాలపై స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవాలంటూ కోర్టులు ఉత్తర్వులు జారీ చేయలేవని ఏజీ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకొని పిటిషన్లను కొట్టివేయాలని కోరారు.
వాదనలను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించగా, పిటిషినర్ల తరఫు అడ్వకేట్ గండ్ర మోహన్‌రావు కల్పించుకుని, వాయిదా ఎక్కువ రోజులు వేయవద్దని, వెంటనే విచారణ పూర్తి చేయాలని లేకపోతే ఎమ్మెల్యేల పిరాయింపుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంటుందని చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తరఫు అడ్వకేట్ బి.మయూర్ రెడ్డి కల్పించుకుని, కోర్టు బయట ఏదో జరగబోతుందని చెప్పి విచారణ సత్వరమే జరగాలని కోరడం సబబు కాదన్నారు.