దత్తతకు వెళ్లాక పుట్టింటి.. ఆస్తిపై హక్కు ఉండదు

దత్తతకు వెళ్లాక పుట్టింటి.. ఆస్తిపై హక్కు ఉండదు

హైదరాబాద్, వెలుగు: ఒక కుటుంబంలో పుట్టిన వ్యక్తి మరో కుటుంబానికి దత్తత వెళ్లిన తర్వాత పుట్టిన కుటుంబంలో ఆస్తి హక్కు ఉండదని హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. దత్తత కంటే ముందే ఆ వ్యక్తికి ఆస్తి రాసిచ్చినా, వాటా రాసిచ్చినా ఆ మేరకే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. దత్తత తర్వాత జన్మించిన కుటుంబంలో అంత్యక్రియలతో సహా ఏ ఖర్చులకూ సంబంధం ఉండదని, ఆదేవిధంగా ఆ కుటుంబ ఆస్తిలో కూడా హక్కు ఉండదని చెప్పింది. ఈ మేరకు ముగ్గురు జడ్జిలతో కూడిన ఫుల్‌‌ బెంచ్‌‌ ఇటీవల తీర్పు చెప్పింది. ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలానికి చెందిన ఏవీఎల్‌‌ఆర్‌‌ నర్సింహారావు మరో కుటుంబానికి దత్తత వెళ్లాక జన్మించిన కుటుంబ ఆస్తిలో కూడా వాటా వస్తుందని కోర్టుకు వెళ్లారు. ఈ వాదనను కింది కోర్టు ఆమోదించింది. ఆ తీర్పును ఆయన సోదరుడు ఎ.నాగేశ్వర్‌‌రావు సవాల్‌‌ చేసిన పిటిషన్‌‌పై జస్టిస్‌‌ పి.నవీన్‌‌రావు, బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డి, జస్టిస్‌‌ నగేశ్ భీమపాకతో కూడిన ఫుల్‌‌ బెంచ్‌‌ 44 పేజీల తీర్పు చెప్పింది. 

కింది కోర్టు తీర్పును కొట్టేసింది. ఏపీ హైకోర్టు నాయుడమ్మ కేసులో చెప్పిన తీర్పుకు చట్టబద్ధత ఉందని స్పష్టం చేసింది. మేనేస్‌‌ హిందూ చట్టం, ముల్లా సూత్రాలు, పాట్నా, అలహాబాద్‌‌ హైకోర్టులు, సుప్రీంకోర్టు చెప్పిన తీర్పుల ప్రకారం దత్తతకు ముందు ఆస్తిలో వాటా కేటాయించినా, ఆస్తి రాసిస్తేనే ఆస్తిలో దత్తత వెళ్లిన వారికి దక్కుతుందని, ఆ విధంగా ఆస్తి కేటాయించకపోతే దత్తతకు వెళ్లిన తర్వాత జన్మించిన కుటుంబం ఆస్తిలో హక్కు ఉండదని తేల్చి చెప్పింది. దత్తత తర్వాత జన్మించిన కుటుంబంలో వ్యక్తి చనిపోతే అందుకు చేసే అంత్యక్రియల ఖర్చులకు కూడా అతనికి సంబంధం లేదని తేల్చింది. తెలుగు రాష్ట్రాల్లో మితాక్షర చట్టం, కోల్‌‌కతాలోని దయాభాగ చట్టం ప్రకారం పుట్టిన వెంటనే ఉమ్మడి కుటుంబం ఆస్తిలో హక్కు ఉంటుందని చెబుతున్నప్పటికీ ప్రత్యేకంగా ఆస్తిపై హక్కు గురించి ఆ చట్టాలు పేర్కొనలేదని తెలిపింది. ఆ  చట్టాల ప్రకారం పూర్వీకుల ఆస్తిలో భాగం ఉంటుందని, అయితే, అందులో మార్పులకు ఆస్కారం ఉంటుందని తెలిపింది. ఈ చట్టాలకు లోబడే ఏపీ హైకోర్టు నాయుడమ్మ కేసులో ఇచ్చిన తీర్పు ప్రామాణికమని పేర్కొంది. దత్తత తర్వాత జన్మించిన కుటుంబ ఆస్తిలో హక్కు ఉంటుందని కింది కోర్టు ఇచ్చిన తీర్పు చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది.