పాతాళ గంగ పైపైకి.. హైదరాబాద్లో భారీగా పెరిగిన భూగర్భ జలాలు.. సగటున 14 నుంచి 28 మీటర్ల లోపల నీళ్లు

పాతాళ గంగ  పైపైకి.. హైదరాబాద్లో భారీగా పెరిగిన భూగర్భ జలాలు..  సగటున 14 నుంచి  28 మీటర్ల లోపల నీళ్లు
  • ఇంకుడు గుంతల నిర్మాణం, భారీ వర్షాలతో పైకి వచ్చిన నీళ్లు
  • మారేడుపల్లిలో 4.61మీటర్ల లోపే..

హైదరాబాద్​సిటీ, వెలుగు:  గ్రేటర్​పరిధిలో ఈసారి కురిసిన భారీ వర్షాలు, వాటర్​బోర్డు చేపట్టిన ఇంకుడు గుంతల స్పెషల్​డ్రైవ్​కార్యక్రమం భూగర్భ జలాలను భారీగా పెంచాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి పలు ప్రాంతాల్లో 3 మీటర్ల నుంచి 16 మీటర్ల వరకు అండర్​గ్రౌండ్​వాటర్​పైకి వచ్చిందని వాటర్​బోర్డు అధికారులు ప్రకటించారు. నగరంలో ఇంకుడు గుంతల కోసం తాము పెట్టుకున్న లక్ష్యం వంద శాతం పూర్తయితే రాబోయే రోజుల్లో కృష్ణా ప్రాజెక్ట్​ నాలుగోదశ అవసరం కూడా ఉండకపోవచ్చని ఆఫీసర్లు అభిప్రాయపడుతున్నారు. 

కాంక్రీట్​జంగిల్..

మహానగరం కాంక్రీట్‌‌‌‌ జంగిల్‌‌‌‌గా మారింది. వర్షపునీరు నేలలో ఇంకే మార్గం లేక భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ప్రతి సంవత్సరం సిటీలో సగటున 85 నుంచి 89 సెం.మీ.కు పైగా వర్షపాతం నమోదవుతున్నా కేవలం 0.75 నుంచి 0.95 శాతం నీళ్లు మాత్రమే నేలలోకి ఇంకుతున్నాయి. మిగతావి మూసీ ద్వారా కృష్ణాలో కలుస్తున్నాయి. ప్రతివేసవిలో బోరుబావుల్లో నీటిమట్టం అడుగంటి నిత్యావసరాలకు వినియోగించే నీటికి డిమాండ్‌‌‌‌ పెరగడంతో జలాశయాల్లో నగర అవసరాలకు కేటాయించిన నీటిని సర్దుబాటు చేయడం వాటర్​బోర్డుకు కష్టంగా మారింది. ఈ సమస్య ఎక్కువగా వెస్ట్​సిటీలో ఉందని బోర్డు గుర్తించింది. భూగర్భ జలాలు పడిపోవడంతో అక్కడ చాలా మంది వాటర్​బోర్డు ట్యాంకర్లపై పడ్డారు. దీంతో ట్యాంకర్ల నిర్వహణపై ఒత్తిడి పెరిగింది. సర్వే చేయించగా చాలామంది ఇంకుడు గుంతలు నిర్మించుకోలేదని, అందుకే సమస్య తీవ్రమైందని తెలుసుకుంది. దీంతో నగరవాసులు ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా ప్రోగ్రామ్​కు రూపకల్పన చేసింది. 

ఏడాది కిందట షురూ..

ఏడాది క్రితం అక్టోబర్‌‌‌‌లో ప్రతి ఇంటా ఇంకుడు గుంత- పేరిట 90 డేస్‌‌‌‌ స్పెషల్‌‌‌‌ డ్రైవ్‌‌‌‌ ప్రారంభించింది. 300 చదరపు మీటర్లకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఇంటి ప్రాంగణంలో ఇంకుడుగుంత తప్పనిసరి చేస్తూ చర్యలు చేపట్టింది. ఇండ్ల నిర్మాణాలకు పర్మిషన్​ఇచ్చే జీహెచ్‌‌‌‌ఎంసీ, మున్సిపాలిటీలకు లెటర్లు రాసింది. పాత, కొత్త నివాస, వాణిజ్య సముదాయాలపై దృష్టి సారించింది. మరోవైపు 182  స్పెషల్​టీమ్స్​ను రంగంలోకి దింపి ఇంకుడుగుంతల్లేని ప్రాంతాలను గుర్తించింది. వారికి 18 ఎన్జీవోలతో అవగాహన కల్పించింది. క్యాన్‌‌‌‌ నెంబర్‌‌‌‌ ఆధారంగా ప్రతి నెలా 20 కంటే ఎక్కువ ట్యాంకర్లను బుక్‌‌‌‌ చేసుకున్న 42,784  ప్రాంగణాలను గుర్తించి నోటీసులు ఇచ్చింది. నిరుపయోగంలో ఉన్న బోరు బావులను హార్వెస్టింగ్‌‌‌‌ పిట్లతో ఇంజక్షన్‌‌‌‌ బోర్‌‌‌‌వెల్స్​గా మార్చేందుకు ప్లాన్లు రూపొందించింది. వాటర్​బోర్డు అవగాహన కార్యక్రమాలు, హెచ్చరికల ఫలితంగా ఇప్పటివరకు 30వేల మంది ఇంకుడు గుంతలు నిర్మించుకున్నారు. 

పైకి ఎగబాకిన గంగమ్మ

గత వేసవిలో సగటున 14 నుంచి 28 మీటర్ల లోపలకు పడిపోయిన భూగర్భజలాలు ఇంకుడు గుంతల ప్రభావం, భారీ వర్షాలతో 3 నుంచి 16 మీటర్ల వరకు పైకి చేరుకున్నాయని వాటర్​బోర్డు రెయిన్ ​వాటర్ ​డిపార్ట్​మెంట్​ తెలిపింది. ఈ వర్షాకాలంలో సాధారణ వర్షపాతం కంటే 42 శాతం అధికంగా నమోదు కావడం కూడా కలిసి వచ్చిందని చెప్తోంది. అలాగే, ఎక్కువగా వాటర్​ట్యాంకర్లు బుక్​చేసుకునే కూకట్‌‌‌‌పల్లి, నిజాంపేట, ప్రగతినగర్, శేరిలింగంపల్లి, మాదాపూర్, మణికొండ, ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ నగర్‌‌‌‌ తో పాటు నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా డిమాండ్​తగ్గింది. 

మన నీళ్లు వృథాగా కృష్ణాలో కలుస్తున్నాయ్​

ఇంకుడు గుంతలు లేకపోవడంతో యేటా వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా మూసీ ద్వారా కృష్ణాలో కలుస్తోంది. వాటిని తిరిగి నగరానికి తరలించేందుకు రూ. కోట్లు వెచ్చిస్తున్నాం. ప్రతి ఇంటా వర్షపు నీటి ఒడిసి పట్టి నేలలోకి ఇంకిస్తే బోరు బావుల్లో భూగర్భజలాల పెరుగుతాయి. మేం ఇంకుడుగుంతల కార్యక్రమం యజ్ఞంలా చేయడం వల్ల భూగర్భజలాలు పెరిగాయి. ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంత నిర్మించుకుంటే భవిష్యత్తులో కృష్ణా తాగునీటి సరఫరా పథకం-–4, కొత్తగా ఇతర నీటి సరఫరా పథకాల నిర్మాణాల అవసరం ఉండదు. ప్రస్తుతం సరఫరా చేస్తున్న జలాలు తాగు నీటి అవసరాలక కోసం సమృద్ధిగా సరిపోతాయి. 
- అశోక్‌‌‌‌ రెడ్డి, వాటర్​బోర్డు ఎండీ

ప్రాంతం                     సెప్టెంబరు-2024     సెప్టెంబర్‌‌‌‌–2025       పెరిగింది(మీటర్లలో)
కూకట్‌‌‌‌పల్లి    11.29        7.90        3.39
బాలాజీనగర్‌‌‌‌     11.48        5.36        6.12
ఆర్‌‌‌‌సీపురం    17.17        9.65        7.52
ఉప్పల్‌‌‌‌    15.53        6.86        8.67
ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ నగర్‌‌‌‌    19.10             10.06        9.04
జీడిమెట్ల    21.58        9.53        12.05
ఫతేనగర్‌‌‌‌    15.84        3.20        12.64
ఎర్రగడ్డ    18.50        4.95        13.55
హస్మత్‌‌‌‌పేట    18.94        5.23        13.71
పటాన్‌‌‌‌ చెరు    18.30        2.58        15.72
మారేడుపల్లి    21.59        4.61        16.98