హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గల కారణాలు షాకింగ్ కు గురిచేస్తున్నాయి. శుక్రవారం (అక్టోబర్ 24) తెల్లవారుజామున హైవేపై బైక్ ను స్లీపర్ బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రమాదం తర్వాత బైక్ బస్సు కింద ఇరుక్కుపోయింది. సుమారు 300 మీటర్లు బైకును బస్సు ఈడ్చుకురావడంతో ప్రమాదం సంభవించింది. దీంతో ఆయిల్ ట్యాంక్ పగిలిపోయి ఆయిల్ లీక్ అయ్యి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కేవలం 7.15 నిమిషాల్లోనే బస్సు తగలబడి పోయింది.
మంటల తీవ్రతను డ్రైవర్లు అంచనా వేయలేదని ఎస్పీ తెలిపారు. ప్రమాదం తర్వాత ప్రయాణికులను ఆలస్యంగా నిద్ర లేపడంతో బయటపడే మార్గం లేకుండా పోయింది. అదే విధంగా ఫైర్ సేఫ్టీ సిస్టంతో కాకుండా నీళ్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేయడం వలన మంటలను ఆర్పలేకపోయారు.
ప్రమాదంలోబస్ హైడ్రాలిక్ సిస్టం దెబ్బతిన్నట్లు చెప్పారు. స్లీపర్ బస్సు కావడంతో నడిచే మార్గం తక్కువగా ఉండటంతో ఎటువైపు నుంచి తప్పించుకోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అంతలోనే బస్సును కమ్మేసిన దగ్ధమైన పొగల కారణంగా ఊపిరాడని పరిస్థితి. ఈ క్రమంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి 20 మంది ప్రయాణికులు బయటపడినట్లు చెబుతున్నారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఏపీ కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. శుక్రవారం (అక్టోబర్ 24) తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో బస్సు మంటల్లో దగ్ధమైపోయింది. కల్లూరు మండలం చిన్న టేకూరు సమీపంలో ప్రమాదానికి గురైంది. తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులు ఉన్నారు. 21 మందికి పైగా మృతి చెందగా మరో మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
