- ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో 294 వైన్స్
- 2025–27 వైన్ షాప్స్కోసం 10,428 అప్లికేషన్లు
- వరంగల్ అర్బన్ నుంచే అత్యధికంగా 3,175
- 2023–25లో 16,037 దరఖాస్తులు, రూ.320.74 కోట్ల ఆదాయం
- గతం కంటే రూ.7.90 కోట్లు తగ్గిన ఇన్‍కమ్
వరంగల్, వెలుగు : ఓరుగల్లు నుంచి ఈసారి వైన్ షాపులకు దరఖాస్తుల రూపంలో రూ.312 కోట్ల 84 లక్షల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 2025–27 కొత్త ఎక్సైజ్ పాలసీ అమలు చేస్తున్న క్రమంలో అప్లికేషన్ల గడువును ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు పెంచారు. కాగా గురువారం రాత్రి నాటికి ఉమ్మడి వరంగల్లోని 6 జిల్లాల పరిధిలోని 294 వైన్ షాపులకు 10,428 అప్లికేషన్లు వచ్చాయి. వరంగల్ అర్బన్ నుంచి అత్యధికంగా 3,175 అప్లికేషన్లు రాగా, అత్యల్పంగా జనగామ నుంచి 1,695 వచ్చాయి. మొత్తంగా దరఖాస్తుల రూపంలో వచ్చే ఆదాయం గత పాలసీ కంటే ఈసారి రూ.7.90 కోట్లు తగ్గింది.
జిల్లాల్లో అటు.. ఇటుగా మారిన షాపుల సంఖ్య..
ఓరుగల్లు 6 జిల్లాలుగా మారినప్పటికీ ఎక్సైజ్‍శాఖ చివరిలో ఏర్పడిన ములుగు జిల్లా లేకుండా 5 జిల్లాల పరిధిలోని స్టేషన్లవారీగా పనిచేస్తోంది. ప్రస్తుత 6 జిల్లాల మండలాల లెక్కన కాకుండా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి స్టేషన్లవారీగా వైన్ షాప్స్ పనిచేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తంగా 294 లిక్కర్ షాపులు అలానే ఉన్నా.. జిల్లాల్లోని షాపుల సంఖ్య అటు.. ఇటుగా మార్చారు.
2023–25 పాలసీలో వరంగల్ అర్బన్‍లో 65 వైన్ షాపులు ఉండగా, ఈసారి 67 అయ్యాయి. వరంగల్ రూరల్ 63 ఉండగా, 57కు తగ్గాయి. జనగామలో గతంలో 47 ఉంటే ప్రస్తుతం 50, మహబూబాబాద్ 59 నుంచి 61 కాగా, భూపాలపల్లి 60 వైన్పాపుల నుంచి 59కి తగ్గించారు. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాత లెక్కన 294 షాప్స్ఉన్నప్పటికీ జిల్లాల్లో సంఖ్య అటు..ఇటుగా మారాయి.
ఈసారి తగ్గిన అప్లికేషన్లు, ఆదాయం..
రాష్ట్రంలో రెండేండ్లకోసారి కొత్త లిక్కర్ పాలసీ అమలు చేస్తుండగా ఉమ్మడి వరంగల్లో ప్రతిసారి అప్లికేషన్ల ఆదాయం అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. 2023–25 పాలసీ కంటే ఈసారి మాత్రం అప్లికేషన్లు తగ్గాయి. దీంతో ఆదాయం సైతం తగ్గింది. 2023–25లో పాలసీలో రూ.2 లక్షల దరఖాస్తు ఫీజుతో 16,037 దరఖాస్తులు రావడంతో రూ.320.74 కోట్ల ఆదాయం వచ్చింది.
ఈసారి పెరిగిన రూ.3 లక్షల ఫీజుతో 10,428 దరఖాస్తులు రాగా, వీటి ఆదాయం రూపంలో రూ.312 కోట్ల 84 లక్షలు వచ్చింది. గత పాలసీతో పోలిస్తే 5,609 అప్లికేషన్లు తగ్గగా, అదేస్థాయిలో రూ.7 కోట్ల 90 లక్షల ఇన్‍కమ్ తగ్గింది.
పాలసీ ఏడాది వచ్చిన అప్లికేషన్లు
2017-19 7,527
2019-21 8,100
2021-23 9,950
2023-25 16,037
2025-27 10,428
