- ఈ సీజన్‌లో లోయర్ మానేరు డ్యామ్‌కు 52 టీఎంసీల ఇన్‌ఫ్లో
- కాకతీయ కెనాల్ ద్వారా వరంగల్ మీదుగా కోదాడలోని చివరి ఆయకట్టుకు గోదావరి నీరు
కరీంనగర్, వెలుగు : మేడిగడ్డ నుంచి నీళ్లు రాకపోయినా.. కాళేశ్వరం పంపులు ఆన్ చేయకపోయినా.. గోదావరి నీళ్లు ఎల్‌ఎండీ మీదుగా కరీంనగర్ జిల్లా నుంచి సూర్యాపేట జిల్లా కోదాడ వరకు చేరుకున్నాయి. గత రెండేండ్ల మాదిరిగానే ఈ సారి కూడా లోయర్ మానేరు డ్యామ్ నుంచి విడుదల చేసిన నీరు చివరి ఆయకట్టుకు చేరింది. ఈ సీజన్‌లో ఆగస్ట్ 12 నుంచి బుధవారం నాటికి లోయర్ మానేరు డ్యామ్‌కు 52.702 టీఎంసీల ఇన్‌ఫ్లోరాగా.. సెప్టెంబర్ 3 నుంచి ఇప్పటివరకు కాకతీయ కెనాల్, స్పిల్‌వే గేట్ల ద్వారా 35.826 టీఎంసీలను విడుదల చేశారు. ఇంకా 23.500 టీఎంసీల నీటితో లోయర్ మానేరు డ్యామ్ నిండుకుండను తలపిస్తోంది.
మూడేండ్లుగా ఆదుకుంటున్న ఎస్సారెస్పీ
దేశంలో కాళేశ్వరమే అతి పెద్ద సాగునీటి ప్రాజెక్ట్ అని, తెలంగాణలోని ఏ జిల్లాకు నీళ్లొచ్చినా అవి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వచ్చినవే అని బీఆర్‌ఎస్ లీడర్లు గతంలో చెప్పుకున్న విషయం తెలిసిందే. కానీ కాళేశ్వరానికి గుండెకాయలాంటి మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీలన్నీ మూడేండ్లుగా నిరుపయోగంగా మారినా సాగునీటి విడుదలలో పెద్దగా తేడా కనిపించకపోవడం విశేషం. సెప్టెంబర్ 3 నుంచి ఇప్పటి వరకు ఎల్ఎండీ నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బయ్యన్నవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మీదుగా సూర్యాపేట జిల్లా వరకు కాకతీయ కెనాల్‌లో నీరు పారుతోంది. ఇరిగేషన్ ఆఫీసర్లు వారబందీ విధానంలో కాకుండా నిరంతరాయంగా నీటిని విడుదల చేస్తున్నారు. ఐదారేండ్ల కింద కాళేశ్వరం పంపులు ఆన్ చేసిన టైంలో ఉమ్మడి వరంగల్, సూర్యాపేట జిల్లాల్లోని ఎస్సారెస్పీ స్టేజ్ 2 ఆయకట్టుకు ఏ స్థాయిలో నీళ్లు అందాయో.. ప్రస్తుతం మేడిగడ్డ నుంచి చుక్క నీరు రాకపోయినా ఆయా జిల్లాలకు అదే స్థాయిలో సాగు నీరు అందుతోంది. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్, నాగారం, అర్వపల్లి, సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూరు (ఎస్), చివ్వెంల, పెన్‌పహాడ్, కోదాడ నియోజకవర్గంలోని మోతె, నడిగూడెం, పెన్‌పహాడ్ మండలాల్లోని కాల్వలు నీటితో కళకళలాడుతున్నాయి.
26 రోజులు పారిన మానేరు
లోయర్ మానేరు డ్యామ్‌కు మిడ్ మానేరు, ఎస్సారెస్పీ నుంచి వరద ఎక్కువగా ఉండడంతో ఎల్ఎండీ గరిష్ట నీటి మట్టానికి చేరుకోగానే ఎప్పటికప్పుడు కిందికి విడుదల చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఒకసారి 10 గేట్లు, మరోసారి 8 గేట్లు, పలుమార్లు 6, 4, 2 చొప్పున ఎల్‌ఎండీ గేట్లను ఎత్తి మానేరు నదిలోకి నీళ్లను వదిలారు. దీంతో మానేరు తీర ప్రాంతాల్లోనూ భూగర్భ జలాలు పెరిగేందుకు దోహదపడింది. చాలా ఏండ్ల తర్వాత 26 రోజుల పాటు మానేరు నది పారడం చూశామని తీర ప్రాంత గ్రామాల రైతులు చెబుతున్నారు. వానాకాలంలో సమృద్ధిగా నీరందిస్తున్న లోయర్ మానేరు డ్యామ్ నుంచి యాసంగిలోనూ నీరు ఇచ్చేలా నిల్వ చేస్తున్నారు.
కాళేశ్వరం పంప్‌లు ఆన్ చేయాలని హడావుడి
కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయకుండా తెలంగాణను ఎడారిగా మార్చేందుకు కుట్ర చేస్తున్నారని, కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలని బీఆర్ఎస్ నేతలు కొన్ని రోజులు హడావుడి చేశారు. జూలై చివరి వారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో మేడిగడ్డను సందర్శించారు. కానీ ఆగస్ట్ రెండో వారంలో భారీ వర్షాలతో ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి నుంచి ఇన్‌ఫ్లో పెరగడం, మిడ్‌మానేరు, లోయర్ మానేరు నిండుకుండలా మారడంతో ఈ ఏడాది కూడా కాళేశ్వరం పంపుల అవసరం లేకుండా పోయింది. దీంతో కాళేశ్వరం పంపులను ఆన్ చేయాలన్న డిమాండ్ మరుగున పడిపోయింది.
