యాదాద్రిలో నిషేధిత భూముల గుర్తింపుపై నిర్లక్ష్యం..సీరియస్‌‌‌‌గా తీసుకోని ఆఫీసర్లు

యాదాద్రిలో నిషేధిత భూముల గుర్తింపుపై నిర్లక్ష్యం..సీరియస్‌‌‌‌గా తీసుకోని ఆఫీసర్లు
  •     గుర్తించడంలో తప్పులు.. మళ్లీ మళ్లీ రీ వెరిఫికేషన్​ 
  •     సెక్షన్​ -22 ఏ.. నిషేధిత భూముల లెక్కల్లో ఉదాసీనత, నిర్లక్ష్యం

యాదాద్రి, వెలుగు:  సెక్షన్​22 ఏలోని నిషేధిత భూముల లెక్కలపై ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో హయ్యర్​ ఆఫీసర్లు మళ్లీమళ్లీ వెరిఫికేషన్​చేస్తున్నారు. అయినప్పటికీ తహసీల్దార్లు సహా రెవెన్యూ డిపార్ట్​మెంట్​లోని కొందరు నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. కొన్నిమండలాల్లో గ్రామాల్లోని లెక్కలు విడిచి పెట్టేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వివిధ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రభుత్వం భూ సేకరణ చేసింది. 

అయితే ప్రాజెక్టుల కోసం సేకరించిన భూమితో పాటు ఏసీబీ, ఎన్ పోర్స్ మెంట్, ఆర్‌‌‌‌‌‌‌‌ఆర్​యాక్ట్​ ప్రయోగించిన వివాదస్పద భూములు, అభివృద్ధిలో భాగంగా నిర్మించే రోడ్లు, ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములను కూడా చేర్చారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన ‘గోల్డెన్​ ఫారెస్ట్​’  సంస్థకు సంబంధించి యాదాద్రి జిల్లాలో ఉన్న వెయ్యి ఎకరాలకు పైగా భూములను పీవోబీలో చేర్చారు. సేకరించిన, నిషేధం విధించిన భూములతో పాటు అదే సర్వే నెంబర్లలో ‘బై నెంబర్ల’  భూములను రిజిస్ట్రేషన్​యాక్ట్​1908 సెక్షన్​-22ఏ కింద పీవోబీలో చేర్చారు.

 ఆ భూములను వాటి యజమానులు క్రయ విక్రయాలు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో నిషేధిత భూములకు సంబంధించి రికార్డులు, రెవెన్యూ డిపార్ట్​మెంట్​లో ఒక విధంగా, రిజిస్ట్రేషన్​అండ్​స్టాంప్స్​లో మరో విధంగా ఉన్నాయని, ఈ కారణంగా ఇబ్బందులు పడుతున్నామంటూ కొందరు యజమానులు కోర్టును ఆశ్రయించారు. దీంతో రికార్డులను సరి చేయాలని కోర్టు ఆదేశించింది. 

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నిషేధిత భూముల నోటిఫై ప్రారంభించింది. ఇందులో భాగంగానే రిజిస్ట్రేషన్​ యాక్ట్​ 1908 సెక్షన్​-22ఏ లోని వ్యయసాయ, వ్యవసాయేతర భూముల్లో ఇనామ్​, గవర్నమెంట్​, సీలింగ్, అసైన్డ్​, సర్​ఫ్లస్​, ఎవాక్యూ ప్రాపర్టీస్​ 1948లో దేశ విభజన తర్వాత పాకిస్థాన్​కు వెళ్లిన వారి భూములను ఫార్మాట్లుగా, సర్వే నెంబర్ల వారీగా లెక్కలు తీయాలని ప్రభుత్వం ఆదేశించింది. రెవెన్యూ రికార్డుల్లో ఉన్న ప్రభుత్వ భూమి ఎంత..? రిజిస్ట్రేషన్​యాక్ట్​ 1908 సెక్షన్​-22 ఏలో ప్రభుత్వ భూమి ఎంత ఉంది..? వివాదాలకు సంబంధించిన భూమి ఎంత..? భూ సేకరణ కింద తీసుకున్న భూమి ఎంత.? వివరాలను రిపోర్ట్​ చేయాలని ఆదేశించింది.  

ఉదాసీనం.. నిర్లక్ష్యం

నిషేధిత భూముల లెక్కలు తీయడంలో రెవెన్యూ డిపార్ట్​మెంట్​లోని స్టాఫ్​ సహా కొందరు ఆఫీసర్లు మరికొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వక్ఫ్​ భూములకు సంబంధించిన డేటా ఇవ్వాలని కోరుతున్నా.. అక్కడి నుంచి డిటైల్స్​ అందడం లేదని తెలుస్తోంది. భూముల విలువలు భారీగా ఉన్న మండలాలకు చెందిన కొందరు తహసీల్దార్లు  లెక్కలు తీయడంలో మరీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 

భూముల విలువలు భారీగా ఉన్న జిల్లా సరిహద్దు మండలంలో పలు గ్రామాలకు సంబంధించిన లెక్కలను అక్కడి తహసీల్దార్​ విడిచిపెట్టినట్టు తెలుస్తోంది. అదే విధంగా భూముల లెక్కలు వాస్తవికంగా నమోదు చేయడంలో కొందరు తహసీల్దార్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్టుగా తెలుస్తోంది. లెక్కలు సరిగా తీయాలని ఎప్పటికప్పుడు అడిషనల్​ కలెక్టర్​ వీరారెడ్డి  హెచ్చరిస్తున్నా పరిస్థితిలో మార్పు ఉండడం లేదు. జిల్లాలో 17 మండలు ఉండగా ఇప్పటివరకూ ఏ ఒక్క మండలంలోనూ భూముల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాలేదని తెలుస్తోంది.  

రీ వెరిఫికేషన్​..

ఈ పరిస్థితుల్లో నిషేధిత భూములకు సంబంధించి మండలాల నుంచి వచ్చిన లెక్కలను ఆర్డీవోలు పరిశీలించిన తర్వాత కలెక్టరేట్​లో మరోసారి పరిశీలిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆర్డీవోలే తహసీల్దార్లకు తిప్పి పంపిస్తున్నారు. అయినప్పటికీ..పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండడం లేదని తెలుస్తోంది.

 ప్రభుత్వ భూములు కాపాడాల్సిన రెవెన్యూ వ్యవస్థ లెక్కలు సరిగా ఇవ్వకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు ఉండాల్సిన ప్రభుత్వ భూములు, నిషేధిత భూములు ఉన్నాయా..? అన్యాక్రాంతమయ్యాయా..? అన్న చర్చ సాగుతోంది. 

చివరగా 2021లో..

ప్రభుత్వ భూములతో పాటు పీవోబీ యాక్ట్​ -22 ఏలో చేర్చిన వివాదస్పద భూముల వివరాలను తరచూ లెక్కిస్తారని రెవెన్యూ ఆఫీసర్లు చెబుతున్నారు. 2006కు ముందు ప్రభుత్వ భూములు పీవోబీలో లేక పోవడంతో యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో 2006లో 22 ఏ కింద ప్రభుత్వ  భూములను చేర్చారు.

 ఆ తర్వాత 2012, 2013లో భూముల వివరాలు పరిశీలన జరిగినట్టుగా ఆఫీసర్లు చెబుతున్నారు. 2020 అక్టోబరు 29న ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చింది. అదే ఏడాది నవంబరు 2 నుంచి ధరణి ద్వారా డిజిటల్ లావాదేవీలు మొదలయ్యాయి. ఆ తర్వాత 2021లోనూ పరిశీలించారు.