
ఐపీఎల్ 2026 సీజన్ ప్లేయర్ల వేలానికి ఇంకా చాలా సమయం ఉన్నా తమకు నచ్చిన ఆటగాళ్లను జట్టులోకి తీసుకునేందుకు ఫ్రాంచైజీలు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్లేయర్ల ట్రేడింగ్ విండో ఓపెన్ అవడంతో ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల బదిలీ కోసం చర్చలు మొదలుపెట్టాయి. ఈ ట్రేడ్ మార్కెట్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ డ్యాషింగ్ వికెట్ కీపర్ -బ్యాటర్ ఇషాన్ కిషన్ అత్యంత డిమాండ్‌లో ఉన్న ఆటగాడిగా నిలిచాడు. ఇషాన్ కిషన్‌ను తిరిగి తమ జట్టులోకి తీసుకురావడానికి ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ముంబైతో పాటు పాటు కేకేఆర్, రాజస్తాన్ రాయల్స్ కూడా సన్ రైజర్స్‌ను సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతానికి ట్రేడ్ విషయంలో సన్‌రైజర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ మూడు జట్లూ తమ టాపార్డర్‌లో వికెట్ కీపర్-బ్యాటర్ కోసం చూస్తున్నాయి. ముంబై టీమ్‌కు నాణ్యమైన ఇండియా వికెట్ కీపర్-–బ్యాటర్ చాలా అవసరం. ఇషాన్ రాకతో ముంబై తుది జట్టులో మరో ఫారిన్ ప్లేయర్‌ను తీసుకునే అవకాశం దక్కుతుంది. అంతేకాక హార్దిక్ పాండ్యా తర్వాత జట్టు పగ్గాలు చేపట్టడానికి టాపార్డర్‌లో సుదీర్ఘకాలం ఉండే ఓ యంగ్ ఇండియన్‌గా ఇషాన్ సరిగ్గా సరిపోతాడని ముంబై భావిస్తోంది.
కేకేఆర్ జట్టుకు ఫారిన్ కీపర్లు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం, రాయల్స్ టీమ్‌లో సంజు శాంసన్ భవిష్యత్తుపై ఉన్న సందిగ్ధత వంటి కారణాల వల్ల కిషన్ ఆ ఫ్రాంచైజీలకూ కీలక టార్గెట్‌గా మారాడు. ఈ ట్రేడ్ రేసులో ముంబై ముందంజలో ఉన్నప్పటికీ, మిగతా ఫ్రాంఛైజీల నుంచి కూడా గట్టి పోటీ ఎదురవుతోంది. అయితే, గత సీజన్ వేలంలో రూ.11.25 కోట్లకు కొనుగోలు చేసిన ఇషాన్ కిషన్‌ను వదులుకోవడానికి సన్‌రైజర్స్ సుముఖంగా లేదని ప్రాథమిక చర్చల ద్వారా తెలుస్తోంది. అయినప్పటికీ, ట్రేడ్ డీల్ అనేది పూర్తిగా ముంబై, హైదరాబాద్ మధ్య జరిగే చర్చలు, ఆటగాడి తుది నిర్ణయంపై ఆధారపడి ఉండనుంది.
ఇక, ఐపీఎల్ మినీ- వేలానికి ముందు అన్ని ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాలను నవంబర్ 15లోగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ గడువులోగా ఇషాన్ కిషన్ ట్రేడ్ డీల్ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.