మెడికల్ కాలేజీల్లో ఫీజుల పెంపు లేదు... హైకోర్టు కీలక ఆదేశాలు

మెడికల్ కాలేజీల్లో ఫీజుల పెంపు లేదు... హైకోర్టు కీలక ఆదేశాలు
  •     మెడికల్ కాలేజీల్లో ఫీజుల పెంపు చెల్లదు
  •     సర్కారు ఇచ్చిన 2 జీవోలను కొట్టివేసిన హైకోర్టు
  •     జీవో 29 ప్రకారమే వసూలు చేయాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్‌ మెడికల్ పీజీ, డెంటల్‌ కాలేజీల్లో 2017–2020 అకడమిక్​  ఏడాదికి ఫీజులను పెంచుతూ సర్కారు ఇచ్చిన 2 జీవోలను హైకోర్టు కొట్టివేసింది. 2017 మే 9న ఇచ్చిన 41, 43 జీవోలు చెల్లవని తేల్చి చెప్పింది. అంతకుముందు 2016–2019 సంవత్సరాలకు ఫీజులను ఖరారు చేస్తూ ఇచ్చిన జీవో 29 ప్రకారమే ఫీజులు వసూలు చేయాలని కాలేజీలకు ఆదేశాలిచ్చింది.  ఒకవేళ జీవో 29లో పేర్కొన్నదాని కంటే ఎక్కువ మొత్తం వసూలు చేసి ఉంటే ఆ మొత్తాలను 30 రోజుల్లోగా స్టూడెంట్లకు చెల్లించాలని ఆదేశించింది. ఫీజులు ఎంత ఉండాలో సిఫార్సు చేసేందుకు తెలంగాణ అడ్మిషన్‌‌ అండ్‌‌ ఫీజు రెగ్యులేషన్‌‌ కమిటీ (టీఏఎఫ్‌‌ఆర్సీ) ఉందని, ఆ కమిటీతో సంబంధం లేకుండా ఫీజుల పెంపునకు జీవోలు జారీ చెల్లదని స్పష్టం చేసింది. ఈ మేరకు చీఫ్‌‌ జస్టిస్‌‌ సతీష్‌‌ చంద్ర శర్మ, జస్టిస్‌‌ షమీమ్‌‌ అక్తర్‌‌లతో కూడిన బెంచ్‌‌ బుధవారం తీర్పు చెప్పింది. టీఎఎఫ్‌‌ఆర్‌‌సీ సిఫార్సుల ప్రకారమే ఫీజులు ఉండాలంటూ ఉస్మానియా జూనియర్‌‌ డాక్టర్స్‌‌ అసోసియేషన్, హెల్త్‌‌ కేర్‌‌ రీఫామ్స్‌‌ డాక్టర్స్‌‌ అసోసియేషన్, తదితరులు వేసిన పిల్స్​పై వాదనల తర్వాత హైకోర్టు ఈ ఉత్తర్వులిచ్చింది. ఫీజుల వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని పీజీ మెడికల్‌‌ కోర్సు పూర్తి చేసిన స్టూడెంట్లకు సర్టిఫికెట్లు ఆపడానికి వీల్లేదని చెప్పింది. కోర్సు పూర్తి చేసినోళ్లకు సర్టిఫికెట్లు ఇచ్చేయాలని ఆదేశించింది.

ఎఫ్‌‌ఆర్సీ వద్దని చెప్పినా.. సర్కారు జీవోలు
మైనార్టీ, నాన్‌‌ మైనార్టీ మెడికల్, డెంటల్‌‌ కాలేజీల్లో పీజీ మెడికల్, డెంటల్‌‌ కోర్సుల ఫీజుల్ని ఖరారు చేయాల్సిన ఫీజుల రెగ్యులేషన్‌‌ కమిటీ (ఎఫ్‌‌ఆర్సీ) ఒప్పుకోకపోయినా సర్కారు తన పరిధిని దాటి ఫీజులు పెంచేందుకు జీవోలు ఇచ్చింది. ‘ఇస్లామిక్‌‌ ఆఫ్‌‌ ఎడ్యుకేషన్‌‌ – పీఏ ఇనాందార్‌‌’ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2007లో ఎఫ్‌‌ఆర్సీని వేసింది. 2015లో ఏర్పాటైన ఎఫ్‌‌ఆర్సీ 2016–19 సంవత్సరాలకు ఫీజులను నిర్ణయించింది. ఆ తర్వాత కొన్ని ప్రైవేట్‌‌ మెడికల్‌‌ కాలేజీలు కోరినయని.. అప్పటి సీఎస్ ఫీజుల్ని పెంచాలంటూ ఎఫ్‌‌ఆర్సీకి లెటర్‌‌ రాశారు. అందుకు ఎఫ్‌‌ఆర్సీ ఒప్పుకోలేదు. అయినా ఫీజుల్ని పెంచుతూ 2017 మే 9న 41, 43 నంబర్ జీవోలు ఇచ్చింది. ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకమని హైకోర్టు స్పష్టం చేసింది.