అచ్చంపేట ఎత్తిపోతల పనులకు హైకోర్టు అనుమతి

అచ్చంపేట ఎత్తిపోతల పనులకు హైకోర్టు అనుమతి

హైదరాబాద్, వెలుగు: నాగర్‌‌‌‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట ఎత్తిపోతల పథకం (ఉమామహేశ్వర ప్రాజెక్టు) పనులపై గతంలో ఎన్జీటీ విధించిన స్టేను హైకోర్టు నిలిపివేసింది. ఎన్జీటీ చెన్నై బెంచ్ ఉత్తర్వుల అమలుపై మధ్యంతర ఆదేశాలిస్తూ, ప్రాజెక్టు పనులకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.సుమారు 71,600 ఎకరాలకు సాగునీరందించే ఉద్దేశంతో ప్రభుత్వం ఉమామహేశ్వర ప్రాజెక్టును చేపట్టింది.

అయితే, ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించారని, ప్రాజెక్టుకు కేవలం 300 మీటర్ల దూరంలోనే 'అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్' ఉందని పేర్కొంటూ సీతారాంరెడ్డి అనే వ్యక్తి ఎన్జీటీని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఎన్జీటీ.. అన్ని అనుమతులు పొందే వరకు పనులను కొనసాగించరాదని ఆదేశించింది.ఎన్జీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏజీ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు, ఎన్జీటీ ఉత్తర్వులను నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చింది.