సెలవుల్లో తరగతుల నిర్వహణపై కౌంటర్‌‌‌‌ వేయండి

 సెలవుల్లో తరగతుల నిర్వహణపై కౌంటర్‌‌‌‌ వేయండి
  • రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: వేసవి సెలవుల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు కాలేజీలు తరగతులు నిర్వహిస్తుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలంటూ నోటీసులు జారీ చేసింది. వేసవి సెలవుల్లో ప్రైవేటు కాలేజీలు తరగతులు నిర్వహించకుండా చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ అడ్వకేట్‌‌‌‌ బి.క్రాంతికుమార్‌‌‌‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌‌‌‌ సూరేపల్లి నంద, జస్టిస్‌‌‌‌ జె.శ్రీనివాసరావుల వెకేషన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌‌‌‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ ఇంటర్‌‌‌‌ బోర్డు ప్రకటించిన విద్యా క్యాలెండర్‌‌‌‌కు విరుద్ధంగా కాలేజీలు ఆఫ్‌‌‌‌లైన్‌‌‌‌, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ తరగతులు నిర్వహిస్తున్నాయని చెప్పారు.

 రెస్ట్ లేకుండా నిరంతరం క్లాసులకు విద్యార్థులు హాజరుకావడం వల్ల వారు నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారని చెప్పారు. చివరికి ఆత్మహత్యలకు దారితీసే ప్రమాదం కూడా ఉందన్నారు. ప్రైవేటు కాలేజీల పనితీరుపై పర్యవేక్షణ పెట్టాలని కోరారు. హెల్ప్‌‌‌‌లైన్‌‌‌‌ ఏర్పాటు చేసేలా ఆదేశించాలని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఇతరులు ఆ హెల్ఫ్‌‌‌‌లైన్‌‌‌‌కు ఫోన్‌‌‌‌ చేసి సమస్యలు చెప్పేందుకు వీలుంటుందని వివరించారు. అదనపు అడ్వకేట్‌‌‌‌ జనరల్‌‌‌‌ తేరా రజనీకాంత్‌‌‌‌రెడ్డి వాదిస్తూ, రాష్ట్రంలో ఏ ప్రైవేట్‌‌‌‌ జూనియర్‌‌‌‌ కాలేజీలోనూ వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించడం లేదని చెప్పారు.

 అయితే ట్యూషన్లు, కోచింగ్‌‌‌‌ సెంటర్లు తరగతులు నిర్వహిస్తే వాటిపై ఇంటర్‌‌‌‌ బోర్డుకు నియంత్రణ ఉండదన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు.. సెలవుల్లో తరగతుల నిర్వహణపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులిస్తూ.. విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.