ఎంఫిల్ అడ్మిషన్ల ప్రక్రియపై వివరణ ఇవ్వండి: ఓయూకి హైకోర్టు నోటీసులు

ఎంఫిల్ అడ్మిషన్ల ప్రక్రియపై వివరణ ఇవ్వండి: ఓయూకి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఠాకూర్‌ హరిప్రసాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌  సైన్సెస్‌లో ఎంఫిల్‌ (క్లినికల్‌ సైకాలజీ) అడ్మిషన్‌ల ప్రక్రియపై వివరణ ఇవ్వాలని ఉస్మానియా యూనివర్సిటీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతోపాటు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ, ఠాకూర్‌  హరిప్రసాద్‌  ఇన్‌స్టిట్యూట్‌  ప్రిన్సిపాల్‌కు నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. 

విచారణను వచ్చే నెల 17కు వాయిదా వేసింది. ఎంఫిల్‌ (క్లినికల్‌ సైకాలజీ) లో ఏవైనా అడ్మిషన్‌లు చేపడితే అవి తదుపరి ఉత్తర్వులకు లోబడి ఉంటాయని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఠాకూర్‌  హరిప్రసాద్‌  ఇన్‌స్టిట్యూట్‌  ఆఫ్‌  రిహాబిలిటేషన్‌  సైన్సెస్‌లో ఎంఫిల్‌ (క్లినికల్‌ సైకాలజీ) సీట్ల భర్తీ పారదర్శకంగా నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన శ్రీకృతి హైకోర్టులో పిటిషన్‌  దాఖలు చేశారు.