హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్కు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్కు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: ఎన్‌‌ఎస్‌‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట నర్సింగ్‌‌ రావును అక్రమంగా అరెస్టు చేశారనే కేసులో హైదరాబాద్ సిటీ పోలీస్‌‌ కమిషనర్‌‌  సీవీ ఆనంద్‌‌తో పాటు ముగ్గురు కింది స్థాయి పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీఆర్‌‌పీసీలో 41 ఏ నోటీసు విషయంలో విధివిధానాలను అమలుచేయకపోవడంపై బల్మూరి దాఖలు చేసిన పిటిషన్‌‌ను శుక్రవారం జస్టిస్‌‌ బి.విజయసేన్‌‌ రెడ్డి విచారించారు. సీఆర్‌‌పీసీలోని విధివిధానాలను పాటించకుండా చట్టవిరుద్ధంగా సీపీ ఆనంద్, సైఫాబాద్‌‌ ఏసీపీ సి.వేణుగోపాల్‌‌ రెడ్డి, ఇన్‌‌స్పెక్టర్‌‌ కె.సత్తయ్య, సబ్‌‌ ఇన్‌‌స్పెక్టర్‌‌ ఎం.సురేశ్‌‌రెడ్డి వ్యవహరించారన్న అభియోగాలపై నాలుగు వారాల్లోగా తమ వాదనను తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. పోలీసుల వివరణ నిమిత్తం కేసు విచారణ మార్చి 10కి వాయిదా పడింది. 

దేవసేనకు  కోర్టు ధిక్కరణ నోటీసు

కోర్టు ధిక్కరణ కేసులో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌‌ ఎ.దేవసేనను హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్‌‌లోని ఎయిడెడ్‌‌ పాఠశాల రఫా–ఇ–ఆమ్‌‌ ఉన్నత పాఠశాల సిబ్బందికి జీతాలు చెల్లించాలన్న ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో దాఖలైన ధిక్కరణ పిటిషన్‌‌ను జస్టిస్‌‌ అభినంద్‌‌ కుమార్‌‌ షావిలి శుక్రవారం విచారించారు. మార్చి 10న విచారణకు హాజరుకావాలన్నారు. 

విద్యుత్‌‌ సంస్థల సీఎండీలకు..

తెలంగాణ విద్యుత్‌‌ సంస్థలు ట్రాన్స్‌‌కో, జెన్‌‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌‌ సంస్థల సీఎండీలకు హైకోర్టు నోటీసులిచ్చింది. రాష్ట్ర ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి అనుకూలంగా 2019లో వెలువడిన ఉత్తర్వులను అమలుచేయలేదంటూ ఆ నలుగురు సీఎండీలపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌  దాఖలైంది. ఈ పిటిషన్ పై  శుక్రవారం విచారించిన జస్టిస్‌‌ అభినంద్‌‌ కుమార్‌‌ షావిలి రెండు వారాల్లోపు కౌంటర్‌‌ దాఖలు చేయాలని సీఎండీలను ఆదేశించారు.