సీసీఎస్ బకాయిలపై విచారణ..ఆర్టీసీకి హైకోర్టు నోటీసులు

సీసీఎస్ బకాయిలపై విచారణ..ఆర్టీసీకి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఆర్టీసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆర్టీసీ కార్మికుల జీతాల నుంచి మినహాయించిన రూ.904 కోట్లను సీసీఎస్( క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ )కి  ఎందుకు డిపాజిట్‌‌ చేయలేదో వివరణ ఇవ్వాలంది. ఈ అంశంపై సొసైటీ సెక్రటరీ బి.మహేశ్, మరొకరితో కలిసి కోర్టులో ఇటీవల రిట్‌‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్‌‌ కే.శరత్‌‌ సోమవారం విచారణ జరిపారు. పిటిషనర్‌‌ తరఫు లాయర్ జయప్రకాశ్​రెడ్డి వాదిస్తూ.. ఆర్టీసీకి, సొసైటీకి జరిగిన అగ్రిమెంట్‌‌ ప్రకారం, ఉద్యోగుల జీతాల నుంచి రూ.639 కోట్లకుపైగా ఆర్టీసీ మినహాయించుకుందని చెప్పారు.

అక్టోబర్‌‌ 31 నాటికి వడ్డీతో కలిపి ఆ మొత్తం రూ.904 కోట్లకు చేరిందన్నారు. వడ్డీ ఇచ్చేందుకు ఆర్టీసీ నిరాకరిస్తోందని, పాత కేసు ఇంకా కోర్టులోనే ఉందని తెలిపారు. సొసైటీలో 36,657 మంది మెంబర్స్‌‌ డబ్బు దాచుకున్నారని చెప్పారు. ఆర్టీసీ తన వాటా డబ్బు డిపాజిట్‌‌ చేయలేదని, రుణం కావాలంటే మంజూరు చేయలేని పరిస్థితుల్లో సొసైటీ ఉందని అన్నారు. ఆర్టీసీ యాజమాన్యానికి కోర్టు నోటీసులిచ్చింది. విచారణ 21కి వాయిదా పడింది.