ప్రణీత్ రావు కేసులో నేడు తీర్పు .. హైకోర్టులో ముగిసిన వాదనలు

ప్రణీత్ రావు కేసులో నేడు తీర్పు .. హైకోర్టులో ముగిసిన వాదనలు
  • చట్ట వ్యతిరేకంగా విచారణ జరుగుతున్నదన్న ప్రణీత్‌‌‌‌ లాయర్‌‌‌‌‌‌‌‌
  • కోర్టు ఉత్తర్వులను పాటిస్తున్నామన్న పోలీసుల తరఫు అడ్వొకేట్​

హైదరాబాద్, వెలుగు :  ఫోన్‌‌‌‌ ట్యాపింగ్, ఆధారాల ధ్వంసం చేశారనే అభియోగాల కేసులో ఎస్‌‌‌‌ఐబీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌‌‌‌ రావు సవాల్‌‌‌‌ చేసిన పిటిషన్‌‌‌‌పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. బుధవారం ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తుది ఉత్తర్వులను గురువారం జారీ చేస్తామని జస్టిస్‌‌‌‌ జి.రాధారాణి ప్రకటించారు. ఫోన్‌‌‌‌ ట్యాపింగ్ కేసులో పోలీసు కస్టడీకి ఇస్తూ కింది కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ప్రణీత్‌‌‌‌ రావు హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. పిటిషనర్‌‌‌‌ తరఫు అడ్వకేట్‌‌‌‌ గండ్ర మోహన్‌‌‌‌రావు వాదిస్తూ, పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లో కనీస మౌలిక వసతులు లేవన్నారు. పోలీసులు రోజువారీ విచారణ చేశాక ప్రణీత్‌‌‌‌ను తిరిగి జైలుకు పంపేలా ఉత్తర్వులివ్వాలని కోరారు. గతంలో ఈ తరహా ఉత్తర్వులు వెలువడ్డాయని గుర్తుచేశారు.

ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు సుదీర్ఘ విచారణ చేయడం చెల్లదని, ఆఫీసు పనివేళల్లో మాత్రమే విచారణ చేయాలన్నారు. విరామం లేకుండా 12 గంటలపాటు విచారణ చేయడం చట్ట వ్యతిరేకమన్నారు. దర్యాప్తులోని కొన్ని కీలక విషయాలను పోలీసులు మీడియాకు లీక్‌‌‌‌ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పిటిషనర్‌‌‌‌ను బంధువులు, లాయర్‌‌‌‌‌‌‌‌ను కలుసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదన్నారు. రెండ్రోజులకోసారి వైద్య పరీక్షలు నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు. 

కింది కోర్టు కస్టడీ ఉత్తర్వులను పాటిస్తున్నం..

కింది కోర్టు కస్టడీ ఉత్తర్వులను సవరించాల్సిన అవసరం లేదని పోలీసుల తరఫు పబ్లిక్‌‌‌‌ ప్రాసిక్యూటర్‌‌‌‌ నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌ రావు వాదించారు. కింది కోర్టు ఉత్తర్వుల ప్రకారమే కస్టడీలో పోలీసుల దర్యాప్తు ఉందని చెప్పారు. ప్రణీత్‌‌‌‌ రావును ఈ నెల 13న అరెస్టు చేసినప్పుడు మాత్రమే మీడియాకు డీసీపీ ప్రకటన విడుదలు చేశారని, ఆ తర్వాత ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదన్నారు. పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లో వసతులు ఉన్నాయని, దర్యాప్తు సమయంలో ఇద్దరు లేదా ముగ్గురు లాయర్లకు అనుమతి ఉందని తెలిపారు. మరో నాలుగు రోజుల్లో ఏడు రోజుల పోలీస్‌‌‌‌ కస్టడీ పూర్తవుతుందని చెప్పారు. లాయర్‌‌‌‌ ఫోన్‌‌‌‌ నుంచి పిటిషనర్‌‌‌‌ తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారని వివరించారు. ఇరు వాదనలు ముగియడంతో గురువారం తుది ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు ప్రకటించింది.