తప్పుడు లెక్కలపై ఆగ్రహం: ఆర్టీసీపై హైకోర్టు ఆర్డర్ కాపీ

తప్పుడు లెక్కలపై ఆగ్రహం: ఆర్టీసీపై హైకోర్టు ఆర్డర్ కాపీ
  • సీఎస్‌‌, గ్రేటర్‌‌ కమిషనర్‌‌ కోర్టుకు రావాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ సమ్మె కేసులో ఈ నెల 1న జరిగిన వాదనల్లో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇన్‌‌చార్జ్ ఎండీ సునీల్ శర్మని స్వయంగా పిలిపించి, వాదనలు అడిగిన కోర్టు ఈ కేసులో లెక్కలపై సీరియస్ అయ్యింది. అప్పటి వాదనల తర్వాత చీఫ్ జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ అభిషేక్ రెడ్డి బెంచ్ ఇచ్చిన ఆర్డర్ కాపీని ఆదివారం విడుదల చేశారు. ఇందులో నవంబర్ 7న విచారణకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్.. కోర్టుకు రావాలని బెంచ్ ఆదేశించింది. వారితో పాటు ప్రభుత్వ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, ఇన్‌‌చార్జ్ ఎండీ సునీల్ శర్మ రావాలని చెప్పింది. 29న విచారణకు ముందు సునీల్ శర్మ ఇచ్చిన అఫిడవిట్ పూర్తిగా తప్పుడు లెక్కలతో ఉందనీ, అవన్నీ సరిచేసి మరిన్ని వివరాలతో కొత్తది వేయాలని బెంచ్ ఆదేశించింది. కోర్టు ఆర్డర్ కాపీలో కీలక అంశాలివి.

‘లోన్’ అని ఉంటే రీయింబర్స్ మెంట్ అంటారే?

సీఎస్ ఎస్కే జోషి

ఆర్టీసీ ఇన్‌‌చార్జ్ ఎండీ సునీల్ శర్మ.. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో 2018–19 ఏడాదికి ప్రభుత్వం ఇవ్వాల్సిన బస్ పాస్ రాయితీ రీయింబర్స్ మెంట్ నిధులు రూ.644.51 కోట్లను పూర్తిగా ఇచ్చేసిందని చెప్పారు. దీనికి ఆధారంగా 16 జీవోలను సమర్పించారు. గ్రేటర్ హైదరాబాద్ లో వస్తున్న నష్టాల కోసం రూ.1786.06 కోట్లను చెల్లించాలని ఆర్టీసీ సంస్థ జీహెచ్ఎంసీని కోరిందని చెప్పారు. దీనికి జీహెచ్ఎంసీ 2015–16లో రూ.108 కోట్లు, 2016–17లో రూ.228.40 కోట్లు కలిపి మొత్తం రూ.336.40 కోట్లను చెల్లించిందని ఇన్‌‌చార్జ్ ఎండీ వివరించారు.

అయితే ఆర్టీసీ కోరిన నిధులు ఇవ్వలేమంటూ 2016 డిసెంబర్లో, 2017 ఏప్రిల్లో జీహెచ్ఎంసీ రెండు తీర్మానాలను ప్రభుత్వానికి పంపించింది. జీహెచ్ఎంసీ చట్టం 112 (30) ప్రకారం ఆర్టీసీ నష్టాలకు నగరపాలక సంస్థ నిధులివ్వాల్సిన అవసరం లేదని కూడా చెప్పింది. గ్రేటర్ ఆర్థిక పరిస్థితిని బట్టి మాత్రమే నిధులివ్వగలుగుతామనీ, అంతేగానీ వీటిని బస్సుల నష్టాలకు బకాయిలుగా చూడకూడదని స్పష్టంచేసింది.

2018–19 రీయింబర్స్ మెంట్ నిధులన్నీ ప్రభుత్వం చెల్లించినట్లు అంగీకరిస్తున్నామనీ, ప్రభుత్వం ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చిందంటూ ఇన్‌‌చార్జ్ ఎండీ అఫిడవిట్లో చెప్పారు. అయితే ఈ అఫిడవిట్, దానికి సపోర్ట్ గా ఇచ్చిన వివరాలను చూస్తే వీటికి సరైన డాక్యుమెంటరీ ఆధారాలు లేవని హైకోర్టు బెంచ్ చెప్పింది. ఈ అఫిడవిట్ పూర్తిగా దానికదే విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించింది. 2018–19 ఏడాదికి కన్సెషన్ నిధులుగా రూ.644.51 కోట్లను చెల్లించినట్లుగా ఇన్‌‌చార్జ్ ఎండీ సమర్పించిన 16 జీవోల్లో 2018లో జూన్ లో ఇచ్చిన జీవో 327, జులైలో ఇచ్చిన జీవో 418, జీవో 445, ఆగస్టులో ఇచ్చిన జీవో 485, సెప్టెంబర్ లో ఇచ్చిన జీవో 563 మొత్తం ఐదు జీవోల్లో నిధులను ‘లోన్’గా ఇచ్చినట్లుగా ఉంది. అంటే ఇవి రీయింబర్స్ మెంట్ గా ఇచ్చినవి కాదని కోర్టు చెప్పింది. పైగా 2018 మేలో ఇచ్చిన జీవో 229లో ఆర్టీసీ బస్సుల కోనుగోలు కోసమే రూ.35 కోట్లు ఇస్తున్నట్లు ఉంది. అంటే ఈ జీవో కూడా ఇన్‌‌చార్జ్  ఎండీ చెబుతున్నట్లుగా రీయింబర్స్ మెంట్ నిధుల కోసం కాదని బెంచ్ కామెంట్ చేసింది.

సునీల్ శర్మ చెప్పినట్లుగా ప్రభుత్వం రూ.644.51 కోట్లు చెల్లించాల్సి ఉండగా, 2018 జూన్ 25న ఇచ్చిన జీవోలో మాత్రమే రీయింబర్స్ మెంట్ కోసం రూ.130 కోట్లు ఇస్తున్నట్లుగా ఉంది. దీన్నిబట్టి ప్రభుత్వం పూర్తిగా రీయింబర్స్ మెంట్ నిధులు ఇచ్చిందని ఆయన అఫిడవిట్లో తప్పుగా చెప్పారని బెంచ్ వ్యాఖ్యానించింది. జీవోల్లో స్పష్టంగా ‘లోన్’ అని కనిపిస్తున్నా అవి ఆర్టీసీ ఖర్చుల కోసం ఇచ్చిన ‘గ్రాంట్లు’ అంటూ సునీల్ శర్మ బలహీనమైన వాదన వినిపించారని చెప్పింది. మిగతా జీవోల్లో విడుదల చేసిన నిధులు కూడా రీయింబర్స్ మెంట్ కోసమే అయితే వాటిలో అదే విషయాన్ని స్పష్టంగా చెప్పి ఉండాల్సిందని బెంచ్ అభిప్రాయపడింది.

ఆయనదో రిపోర్టు ఈయనదో రిపోర్ట్

జీహెచ్ఎంపీ కమిషనర్

‘‘విచిత్రంగా 2018–19లో జీహెచ్ఎంసీ ఎన్ని నిధులు ఇవ్వాల్సి ఉందో సునీల్ శర్మ్ అఫిడవిట్లో ఎక్కడా ఒక్క ముక్క రాయలేదు. అయితే ప్రభుత్వ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రెటరీ కె.రామకృష్ణారావు ఇచ్చిన అఫిడవిట్లో జీహెచ్ఎంసీ రూ.1492 కోట్లను ఆర్టీసీకి ఇవ్వాల్సి ఉందని స్పష్టంగా చెప్పారు. అందులో రూ.335 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ ఇవ్వాల్సిన బ్యాలెన్స్ నిధులను ప్రభుత్వమే మరో రూపంలో చెల్లించేసిందని కూడా ఆయన అఫిడవిట్లో రాశారు. ఈ అఫిడవిట్ ను బట్టి జీహెచ్ఎంసీ మిగిలిన నిధులను ఇవ్వాల్సి ఉందని అర్థమవుతోంది. అంటే జీహెచ్ఎంసీ నుండి ఆర్టీసీకి నిధులు చెల్లించాల్సిన బాధ్యత ఏమీ లేదంటూ చేస్తున్న వాదన తప్పు. ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ, ఇన్‌‌చార్జ్  ఎండీలు వేసిన అఫిడవిట్లు రెండు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి. ఆర్టీసీ నుంచి రవాణా మంత్రి అజయ్ కి ఇచ్చిన డేటా కూడా విరుద్ధంగా ఉందని సీనియర్ అడ్వొకేట్ డి.ప్రకాశ్ రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. మంత్రికి ఆర్టీసీ ఇచ్చిన సమాచారంలో ‘ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు’ అని స్పష్టంగా ఉంది. ఈ చార్ట్ ప్రకారం ప్రభుత్వం నుంచి రావాల్సిన కన్సెషన్ నిధులు రూ.560.70 కోట్లు, లోన్ రీపేమెంట్ నిధులు రూ.218.66 కోట్లు, గ్రేటర్ నష్టాలకు జీహెచ్ఎంసీ ఇవ్వాల్సిన నిధులు రూ.1492.70 కోట్లు. అంటే రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీల నుంచి రావాల్సిన మొత్తం నిధులు రూ.2,272.06 కోట్లు. ఈ వివరాలు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు అనే పేరుతో ఆర్టీసీ ఇచ్చిన చార్టులోనే ఉన్నాయి.’’

‘‘మంత్రికి ఆర్టీసీ ఇచ్చిన సమాచారం చాలా కీలకమైన, బలమైన ఆధారంగా కనిపిస్తోంది. ఆర్టీసీ తన మంత్రినే తప్పుదోవ పట్టించలేదు కదా. ప్రభుత్వం రూ.560.75 కోట్లు చెల్లించాలని ఆర్టీసీ లెక్కలే చెబుతుంటే, ఎక్కువే చెల్లించారని అదే సంస్థ ఇన్‌‌చార్జ్ ఎండీ విరుద్ధంగా చెప్పారు. జీహెచ్ఎంసీ చెల్లించాల్సిన దాంట్లో రూ.336 కోట్లు చెల్లించింది మరో రూ.1155.60 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కాబట్టి సునీల్ శర్మ ఇచ్చిన అఫిడవిట్ అర్థం లేనిది, విరుద్ధమైంది. ఉద్దేశపూర్వకంగా ఇచ్చిన తప్పుడు అఫిడవిట్’’ అని కోర్టు కామెంట్ చేసింది.