
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో 41ఏ కింద నోటీసులు అందుకున్న అంబర్‌పేటకు చెందిన లాయర్ పోగులకొండ ప్రతాప్‌గౌడ్‌ను అరెస్టు చేయొద్దని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలువరించే దాకా అరెస్టు చేయరాదని చెప్పింది. సిట్ కోరిన మేరకు 25వ తేదీన విచారణకు హాజరుకావాలని ప్రతాప్‌ను ఆదేశించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ సీఆర్పీసీ 41ఏ సెక్షన్ కింద తనకు ఇచ్చిన నోటీసును సవాల్ చేస్తూ ప్రతాప్‌గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి గురువారం విచారించారు. సింహయాజీ స్వామితో సంబంధాలు ఉన్నాయంటూ పోలీసులు వేధిస్తున్నారని, ఈ నోటీసులను కొట్టేయాలని ఆయన తరఫు సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది వినోద్ కుమార్ దేశ్‌పాండే చెప్పారు.
సెక్షన్ 160 కింద నోటీసు ఇవ్వాలని, కేసులో నిందితుల మాదిరిగా 41ఏ నోటీసు చెల్లదన్నారు. ఏ ఆధారాలు లేకపోయినా నోటీసు ఇచ్చారన్నారు. నోటీసుపై స్టే ఇవ్వాలని, అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై సిట్ తరఫున ఏజీ, అదనపు ఏజీలు వాదిస్తూ.. ఆధారాలన్నీ భద్రంగా ఉన్నాయని, టెక్నికల్ డివైజెస్ల్లోని ఆధారాల్ని బయట పెట్టలేమన్నారు. ఈ కేసులో ప్రతాప్ ప్రధానమని, విచారిస్తే కీలక సమాచారం బయటపడుతుందన్నారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు.. 41ఏ నోటీసుల్లోని నిబంధనల ప్రకారం 25న జరగాల్సిన సిట్ విచారణకు వెళ్లాలని ప్రతాప్‌గౌడ్‌ను సూచించింది. అయితే ప్రతాప్‌ను అరెస్టు చేయరాదని ఉత్తర్వులు జారీ చేసింది.