ఓయూ హాస్టళ్లలో విద్యుత్, నీటి సరఫరా పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశం

ఓయూ హాస్టళ్లలో విద్యుత్, నీటి సరఫరా పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ) హాస్టళ్లలో వెంటనే విద్యుత్, నీటి సరఫరా పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. హాస్టళ్లలో విద్యుత్, నీటి సరఫరా పునరుద్ధరించకపోతే రేపు రిజిస్ట్రార్ ధర్మాసనం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు ఓయూ హాస్టల్ విద్యార్థుల పిటిషన్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 2వ తేదీ నుంచి హాస్టళ్లలో విద్యుత్, నీటి సరఫరా తొలగించడంతో విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈనెల 26 వరకు సెలవులు పొడిగించారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయని, హాస్టళ్లు మూసివేయడం వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే నిరుపేద విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. పిటిషనర్ల వాదనలు విన్న న్యాయస్థానం వెంటనే కరెంటు, నీటి సరఫరా పునరుద్దరించాలంటూ ఓయూ అధికారులను ఆదేశించింది.

అంతకుముందు.. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. హాస్టల్స్ లో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో రోడ్లపై బైఠాయించారు. సెమిస్టర్ పరీక్షలు పూర్తవడంతో ఈనెల 26వ తేదీ వరకు విద్యార్థులకు ఓయూ అధికారులు సెలవులు ఇచ్చారు. అయితే.. ఈ నెల16వ తేదీన గ్రూప్ 1 పరీక్ష ఉండటంతో చాలామంది విద్యార్థులు పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారు. ఈ సమయంలో హాస్టల్స్ లో కరెంట్, వాటర్ నిలిపివేసి.. హాస్టల్స్ ఖాళీ చేయమనడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీసీ రవీందర్ స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.