డిసెంబరు 31 తర్వాత నిర్ణయం తీసుకోండి..బుద్వేలు భూముల వేలంపై హెచ్‌‌‌‌ఎండీఏకు హైకోర్టు ఆదేశం

డిసెంబరు 31 తర్వాత నిర్ణయం తీసుకోండి..బుద్వేలు భూముల వేలంపై హెచ్‌‌‌‌ఎండీఏకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌‌ మండలం బుద్వేలు గ్రామంలోని సర్వే నెం.288/4లోని 4.19 ఎకరాల భూముల వేలానికి సంబంధించి డిసెంబరు 31 తర్వాతే నిర్ణయం తీసుకోవాలని హెచ్‌‌ఎండీఏను మంగళవారం హైకోర్టు ఆదేశించింది. బుద్వేలులో తమ తండ్రి పేరిట ఉన్న 4.19 ఎకరాల పట్టా భూమిని వేలం వేయడాన్ని సవాలు చేస్తూ కె.రవీందర్, అతని సోదరుడు హైకోర్టులో పిటిషన్‌‌ వేశారు.

 దీనిని విచారించిన సింగిల్‌‌ జడ్జి.. ప్రైవేటు వ్యక్తులు ఇచ్చిన వినతిపత్రంపై కలెక్టర్‌‌ ఉత్తర్వులు జారీ చేయాలని, అంత వరకు వేలంపై నిర్ణయం తీసుకోవద్దని ఆదేశించారు. సింగిల్‌‌ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ హెచ్‌‌ఎండీఏ చేసిన అప్పీలుపై హైకోర్టు బెంచ్‌‌ మంగళవారం విచారణ చేపట్టింది. 

ప్రైవేటు వ్యక్తులకు చెందిన యాజమాన్య హక్కులపై వారు పెట్టుకున్న వినతిపత్రంపై డిసెంబరు 12లోగా నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్‌‌ను ఆదేశించింది. కలెక్టర్‌‌ జారీ చేసిన ఉత్తర్వులను 15లోగా వారికి అందజేయాలని, డిసెంబరు 31 తర్వాత వేలంపై నిర్ణయం తీసుకోవాలని హెచ్‌‌ఎండీఏను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.