మహవీర్‌‌ మెడికల్ స్టూడెంట్లను వేరే చోట సర్దుబాటు చేయండి : హైకోర్టు

మహవీర్‌‌ మెడికల్ స్టూడెంట్లను వేరే చోట సర్దుబాటు చేయండి : హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: గుర్తింపు రద్దు చేసిన మహవీర్‌‌ మెడికల్‌‌ కాలేజీలోని పీజీ స్టూడెంట్లను ఇతర కాలేజీల్లో సర్దుబాటుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికీ సర్దుబాటు చేయకపోతే విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలని నేషనల్‌‌ మెడికల్‌‌ కమిషన్‌‌ (ఎన్​ఎంసీ)ను, రాష్ట్ర సర్కార్‌‌ను ప్రశ్నించింది. ఇతర కాలేజీలో తమను సర్దుబాటు చేయకపోవడంపై తేజస్విని ఇతర పీజీ స్టూటెండ్స్‌‌ ఇటీవల కోర్టులో పిటిషన్ వేశారు. దాన్ని జస్టిస్‌‌ అభినంద్‌‌ కుమార్‌‌ షావిలి, జస్టిస్‌‌ ఎన్‌‌.రాజేశ్వర్‌‌రావుల బెంచ్‌‌ గురువారం  విచారించింది. విద్యా సంవత్సరం ముగిసే దశకు వచ్చినా.. స్టూడెంట్స్‌‌ను వేరే కాలేజీల్లో సర్దుబాటు చేయకపోవడం అన్యాయమని పిటిషనర్‌‌ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. అడ్మిషన్లు ఇచ్చాక మహవీర్‌‌  కాలేజీ గుర్తింపు రద్దు చేశారు.. మరి అందులోని స్టూటెండ్స్‌‌ భవిష్యత్‌‌ ఏం కావాలని కోర్టు ప్రశ్నించింది. వెంటనే వేరే కాలేజీలో స్టూడెంట్స్‌‌ను సర్దుబాటు చేయాలని ఆదేశించింది.

ఆ స్టూడెంట్​కు మెడిసిటీలో సీటు ఇవ్వండి

పీజీ మెడికల్‌‌ అడ్మిషన్లల్లో భర్తీ కాని సీటుకు జరిపిన కౌన్సెలింగ్‌‌లో రూల్స్‌‌ ప్రకారం సాత్వికారెడ్డి అనే విద్యార్థినికి మెడిసిటీ కాలేజీలో సీటు ఇవ్వాలని కాళోజీ హెల్త్‌‌ యూనివర్సిటీని హైకోర్టు ఆదేశించింది. సాత్వికారెడ్డి 4వ ప్రాధాన్యంగా మెడిసిటీ, 5వ ప్రాధాన్యంగా ఎంఎన్‌‌ఆర్‌‌ కాలేజీలను ఎంపిక చేసుకున్నారు. అయితే, అప్పటికే ఖమ్మం మమతా మెడికల్ కాలేజీలో అడ్మిషన్‌‌ పొందిన కె.మౌనిక కౌన్సెలింగ్‌‌లో పాల్గొనడంతో సాత్వికారెడ్డి సీటు మరొకరికి దక్కింది. మౌనిక, మమతా కాలేజీలో అడ్మిషన్‌‌ రద్దు చేసుకోకుండా కౌన్సెలింగ్‌‌లో పాల్గొనడంతో చర్యలు తీసుకున్నామని అధికారులు చెప్పారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో సాత్వికారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో వర్సిటీ అధికారులను తప్పుబట్టిన హైకోర్టు.. సాత్వికారెడ్డికి మెడిసిటీ కాలేజీలో సీటు ఇవ్వాలని ఆదేశించింది.