కౌంటరు దాఖలు చేయకపోతే కోర్టుకు హాజరుకావాలి... రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శికి హైకోర్టు ఆదేశం

కౌంటరు దాఖలు చేయకపోతే కోర్టుకు హాజరుకావాలి... రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం ఇంజాపూర్‌లో సర్వే నెం.126లో ఆక్రమణలకు సంబంధించిన కేసులో ఏప్రిల్‌ 9లోపు కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయకపోతే వ్యక్తిగత విచారణకు హాజరుకావాలని రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రభుత్వ భూమి ఆక్రమణలు, రికార్డుల మార్పిడి, అక్రమ లేఔట్‌లు, అధికార దుర్వినియోగం, రాజకీయ నేతల పాత్రపై విచారణ జరిపించాలన్న తమ వినతిపత్రంపై అధికారులు స్పందించలేదంటూ సరూర్‌నగర్‌కు చెందిన న్యాయవాది సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హైకోరును ఆశ్రయించారు. 

దీనిని ఇటీవల జస్టిస్‌ నగేశ్‌ భీమపాక విచారించారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది సంతోష్‌కుమార్‌ వాదిస్తూ వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైందన్నారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర లేదా సీబీఐతో విచారణకు ఆదేశించాలని కోరారు. ఈ వాదనలపై స్పందించిన న్యాయమూర్తి.. కౌంటర్‌ దాఖలు చేయాలని గతంలో ఆదేశించినప్పటికీ పట్టించుకోపోవడంతో రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి తీరును తప్పపట్టారు.