యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి గ్రామ సర్పంచ్ పడాల వనితపై సస్పెన్షన్ ఎత్తేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అవినీతికి పాల్పడ్డారని నిర్ధారిస్తూ మే 13న సర్పంచ్ పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆరు నెలల పాటు సస్పెన్షన్ విధించారు. అయితే సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ సర్పంచ్ వనిత హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు ఆమె సస్పెన్షన్ ఎత్తివేస్తూ తీర్పు వెల్లడించింది.
ఇటీవల రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 2018–37(5) చట్టం ప్రకారం విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే సర్పంచ్‌లను సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్లకు కట్టబెట్టడంతో వారు ఆందోళన చెందుతున్నారు. శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు, హరితహారం, పల్లెప్రకృతివనం పనుల్లో జాప్యం జరిగినా సస్పెండ్ చేస్తున్నారు కలెక్టర్లు. ఆయా గ్రామాల్లో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పలానా సమస్య పరిష్కరించకుండా సర్పంచ్ నిర్లక్ష్యంగా ఉన్నారంటూ ఫిర్యాదు చేసినా సరే వేటు వేస్తున్నారు.
