ఎగ్జామ్స్‌‌ వేళ సౌండ్‌‌ నియంత్రణకు చర్యలు

ఎగ్జామ్స్‌‌ వేళ సౌండ్‌‌ నియంత్రణకు చర్యలు
  • చర్యలు తీసుకోండిరాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్‌‌ లోని ఫంక్షన్‌‌ హాళ్ల నుంచి పరిమితికి మించి సౌండ్‌‌ రాకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అధిక సౌండ్ తో ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు కూడా ఇబ్బంది కలుగుతుందనే విషయాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించాలని స్పష్టం చేసింది.

సికింద్రాబాద్‌‌ తాడ్‌‌బండ్, బోయినపల్లిలోని బాంటియా గార్డెన్స్‌‌ ఇంపీరియల్‌‌ గార్డెన్స్‌‌ ఫంక్షన్‌‌ హాళ్ల వల్ల పరిమితికి మించిన శబ్దాలు వస్తున్నాయని మిలిటరీ అదనపు చీఫ్‌‌ ఇంజినీరు కల్నల్‌‌ సతీశ్ భరద్వాజ్‌‌ రాసిన లేఖను హైకోర్టు పిల్‌‌గా పరిగణించింది.  దీన్ని చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే జస్టిస్‌‌ జె.అనిల్‌‌ కుమార్ తో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ గురువారం మరోసారి విచారించింది.

హైదరాబాద్‌‌ నగరంలో 70 ఫంక్షన్‌‌ హాళ్లు, కన్వెన్షన్‌‌ హాళ్లకు నోటీసులు జారీ చేసినట్లు అదనపు అడ్వొకేట్‌‌ జనరల్‌‌ మహమ్మద్‌‌ ఇమ్రాన్‌‌ ఖాన్‌‌ చెప్పారు.  సికింద్రాబాద్‌‌ కంటోన్మెంట్‌‌ బోర్డు లాయర్‌‌ వాదిస్తూ.. బాంటియా గార్డెన్స్, ఇంపీరియల్‌‌ గార్డెన్స్‌‌ ఫంక్షన్‌‌ హాళ్లతోపాటు కంటోన్మెంట్‌‌ బోర్డు పరిధిలోని కన్వెన్షన్‌‌ హాళ్లకు ఈ నెల 11న నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అనంతరం ఏప్రిల్‌‌ 15కు విచారణ వాయిదా పడింది.