
హైదరాబాద్, వెలుగు : బెండలపాడు నుంచి చత్తీస్‌గఢ్‌కు చెందిన గొత్తికోయలను పంపేయాలని, వాళ్లను బహిష్కరిస్తూ గ్రామ పంచాయతీ చేసిన తీర్మానాన్ని హైకోర్టు రద్దు చేసింది. ఖమ్మం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడు జీపీకి ఆ విధమైన తీర్మానం చేసే హక్కు, అధికారం లేదని హైకో ర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు జస్టిస్ కన్నెగంటి లలిత సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం బెండలపాడు పంచాయతీ చేసిన తీర్మానాన్ని సవాల్ చేస్తూ బెండలపాడుకు చెందిన కావసి హెడ్మా సహా మరో ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. పంచాయతీ తీర్మానం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21, 300 ఏ, 242, 366 ను ఉల్లంఘించడమే అవుతుందని పిటిషనర్ల తరఫు అడ్వకేట్ ప్రభాకర్ వాదించారు. వారంతా 25 ఏండ్లుగా అక్కడే నివసిస్తున్నారని తెలిపారు. గొత్తికోయలను చత్తీస్‌గఢ్ కు పంపివేయాలని బెండలపాడు పంచాయతీ నవంబరు 26న చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని కోరారు.