
హైదరాబాద్, వెలుగు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 2011లో వారిపై నమోదైన క్రిమినల్ కేసులను సోమవారం కోర్టు కొట్టేసింది. ఆయా కేసుల్లోని ఆరోపణలకు ఆధారాలు లేవని జస్టిస్ కె.లక్షణ్ తీర్పు చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ 2021 జనవరి 19న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో భట్టి, ఉత్తమ్ ఇతరులు పాల్గొన్నారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని పోలీసులు వారిపై క్రిమినల్ కేసులు పెట్టారు.
వీటిని కొట్టేయాలంటూ భట్టి, ఉత్తమ్ హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లను విచారించిన కోర్టు.. ర్యాలీ, సభ కారణంగా శాంతి భద్రతలకు భంగం వాటిల్లినట్టు పోలీసులు ఆధారాలు చూపలేదని, రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనేందుకు కూడా ఆధారాలు సమర్పించలేదని తేల్చింది. ఇదిలా ఉండగా, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డిపై నమోదైన రెండు కేసులను కూడా హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసుల్లో పోలీసులు ఆధారాలు చూపలేదని జస్టిస్ లక్ష్మణ్ వెలువరించిన తీర్పులో పేర్కొన్నారు.