
హైదరాబాద్, వెలుగు : గత కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన ‘ధరణి’లో మార్పులు చేర్పులు చేసి కొనసాగిస్తారో లేదో లేక రద్దు చేస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలని కోరింది. ప్రభుత్వ విధానం ఏమిటో తెలిసిన తర్వాతే తాము తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రభుత్వ వైఖరిని తెలియజేసేందుకు గడువు కావాలని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టును కోరారు.
దీంతో నాలుగు వారాలపాటు సమయం ఇస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 2కి వాయిదా వేశారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలో పలు సర్వే నెంబర్లల్లోని 146 ఎకరాల క్రయవిక్రయాలకు చెందిన దస్తావేజుల సర్టిఫైడ్ కాపీలను గండిపేట తహసీల్దార్ ఇవ్వడం లేదంటూ హైదరాబాద్‌కు చెందిన ఎ. జైహింద్ రెడ్డి, మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ధరణి పోర్టల్‌లో ఎదురవుతున్న సమస్యలను కూడా ఆ పిటిషన్లల్లో వివరించారు. గత ఏడాది ఈ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపిన సందర్భంగా భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ను వ్యక్తిగతంగా కోర్టుకు పిలిపించుకుని పలు అంశాలపై ప్రశ్నలడిగింది. గ్రామ, మండల స్థాయి అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ల ద్వారా క్రోడీకరించి వాటిని పరిష్కరించాలని ఆదేశించింది.
ఆ ఉత్తర్వుల అమలు నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీసీఎల్‌ఏను ఆదేశించింది. శుక్రవారం మరోసారి జరిగిన విచారణ సమయంలో సమస్యల పరిష్కారానికి మాడ్యుల్స్ ఏర్పాటు కాలేదని గుర్తించిన హైకోర్టు.. అసలు ధరణి పోర్టల్‌ను కొత్త ప్రభుత్వం కొనసాగిస్తుందో లేదో చెప్పాలని ఆదేశించింది. ధరణి రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉంటే తాము ఉత్తర్వుల జారీ అవసరమే ఉండదని చెప్పింది. లేదంటే గతంలో తామిచ్చిన ఉత్తర్వుల అమలు అంశంపై విచారణ కొనసాగిస్తామని తెలిపింది.