దళిత బంధుకు  ఎమ్మెల్యేల సిఫార్సు ఏంది?

దళిత బంధుకు  ఎమ్మెల్యేల సిఫార్సు ఏంది?

లబ్ధిదారుల ఎంపికలో వాళ్ల జోక్యం ఉండొద్దు:  తేల్చిచెప్పిన హైకోర్టు 

హైదరాబాద్, వెలుగు: దళిత బంధులో లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ఎమ్మెల్యేలు ఎవరని హైకోర్టు నిలదీసింది. ఈ పథకంలో ఎమ్మెల్యేల సిఫార్సుతో పనేముందని ప్రశ్నించింది. అర్హత మేరకు లబ్ధిదారుల ఎంపిక ఉండాలని, వచ్చిన దరఖాస్తులను కమిటీకి పంపాలని సూచించింది. ఎమ్మెల్యే సిఫార్సులకు, లబ్ధిదారుల ఎంపికకు ఎలాంటి  సంబంధం లేదని తేల్చిచెప్పింది. గైడ్‌‌లైన్స్‌‌ ప్రకారం కమిటీ పరిశీలన చేస్తుందని తెలిపింది. ప్రభుత్వ పథకాల్లో రాజకీయ జోక్యం తగదని స్పష్టం చేసింది. ఎమ్మెల్యే సిఫార్సు ఉండాలని చెప్పి దళితబంధు అప్లికేషన్లను వరంగల్​ జిల్లా కలెక్టర్‌‌ తిరస్కరించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. తమకు దళిత బంధు ఇప్పించాలంటూ కొందరు వరంగల్‌‌ కలెక్టర్‌‌కు దరఖాస్తు చేసుకోగా.. ఎమ్మెల్యే సిఫార్సు లేకుండా దరఖాస్తులు స్వీకరించలేమని, ఎమ్మెల్యే సిఫార్సు ఉంటేనే  కమిటీ పరిశీలిస్తుందంటూ కలెక్టర్‌‌ ఆ దరఖాస్తులను తిరస్కరించారు. 

వరంగల్‌‌‌‌కు చెందిన జె.శ్రీనివాస్‌‌‌‌ సహా నలుగురు..

దీన్ని సవాల్​ చేస్తూ  వరంగల్‌‌‌‌కు చెందిన జె.శ్రీనివాస్‌‌‌‌ సహా నలుగురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ రిట్​పై  జస్టిస్‌‌‌‌ పి.మాధవీదేవి గురువారం విచారణ జరిపారు. ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తారని కలెక్టర్‌‌‌‌  చెప్పడం చట్ట వ్యతిరేకమని పిటిషనర్‌‌‌‌ తరఫు అడ్వకేట్​వాదనలు వినిపించారు. ‘‘ఎమ్మెల్యేను కలిస్తే అధికార టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీకి చెందినవాళ్లనే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తామని చెప్పారు. ఇతరుల దరఖాస్తులను పట్టించుకోబోమన్నారు. ఎమ్మెల్యేల సిఫార్సు ఉంటే తప్ప.. దరఖాస్తులు స్వీకరించబోమని అధికారులు అంటున్నారు. దీని వల్ల టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కార్యకర్తలకు మాత్రమే దళితబంధు అందుతుంది.. ఇతర అర్హులకు నిరాశే ఎదురవుతుంది” అని అన్నారు. దీనిపై  ప్రభుత్వ అడ్వకేట్​ స్పందిస్తూ.. రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులను కమిటీ ఎంపిక చేస్తుందని తెలిపారు. వాదనల తర్వాత హైకోర్టు.. ఎమ్మెల్యేల సిఫార్సులతో సంబంధం లేకుండా దళితబంధు లబ్ధిదారుల ఎంపికను కమిటీ ద్వారా చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ప్రతివాదులుగా చీఫ్‌‌‌‌ సెక్రటరీ, సోషల్‌‌‌‌ వెల్ఫేర్​ సెక్రటరీ, ఎస్సీ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ కమిషనర్, వరంగల్‌‌‌‌ జిల్లా కలెక్టర్, వరంగల్‌‌‌‌ ఎస్సీ కార్పొరేషన్‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ను చేర్చారు.