- పంపిన నోటీసులకు ఆధారాలేంటి?
- డేటా మ్యాచింగ్ ఎలా చేస్తున్నారు
- ఆటోమేటెడ్ విధానంపైనా ఆరా
- పూర్తి వివరాలివ్వాలని ఈసీకి ఆదేశం
- ఏ ప్రాతిపదికన నోటీసులిచ్చిన్రు?
- సర్ ప్రక్రియపై ఈసీని ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: ఓటర్లు సమర్పించిన ఎస్‌ఐఆర్ ఎన్యుమరేషన్ పత్రాల్లో లోపాలున్నాయంటూ వారికి నోటీసులు జారీ చేయడానికి అనుసరిస్తున్న ప్రాతిపదిక ఏమిటో వివరించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎన్యుమరేషన్ వివరాల పరిశీలన, సవరణకు వినియోగిస్తున్న ఈసీఐనెట్, ఈఆర్‌ఓనెట్ వంటి ఆటోమేటెడ్ డేటా మ్యాచింగ్ విధానం ఎలా పనిచేస్తుందో కూడా వెల్లడించాలని స్పష్టం చేసింది.
ఈ ప్రక్రియ పారదర్శకంగా లేదంటూ ఎస్.క్యూ. మసూద్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ పి.శ్యాంకోశి, జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. భౌతిక రికార్డులను సరిగా పరిశీలించకుండానే ఆటోమేటెడ్ ప్లాట్‌ఫారం ఆధారంగా నోటీసులు జారీ చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.
పిటిషనర్ తండ్రి పేరులో ప్రస్తుత, గత ఓటర్ల జాబితాల మధ్య వ్యత్యాసం ఉండటంతోనే నోటీసు ఇచ్చామని ఈసీ తరఫు న్యాయవాది తెలిపారు. పిటిషనర్ నోటీసుకు వివరణ ఇచ్చిన తర్వాత అధికారులు తీసుకున్న చర్యలు ఏమిటో, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో నోటీసుల జారీకి అనుసరిస్తున్న విధానం ఏమిటో పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించిన ధర్మాసనం.. కేసు విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.
