
- తెలుగులో రాస్తే మార్కులు ఎందుకు తగ్గుతున్నయ్.. వివరణ ఇవ్వాలని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: గ్రూప్–1 మెయిన్స్ మూల్యాంకనం ఏ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారో చెప్పాలని టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. తెలుగులో పరీక్ష రాస్తే ఎందుకు తక్కువ మంది పాస్ అవుతున్నారని ప్రశ్నించింది. తెలుగులో రాసినవారు ఎంత మంది అర్హత సాధించారో చెప్పాలంది. గ్రూప్–1 మూల్యాంకనంలో అవకతకవలు జరిగాయని దాఖలైన పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు బుధవారం విచారణ చేపట్టారు. తెలుగు భాషపై చిన్న చూపు ఉందని, తెలుగులో రాసినవారికి మార్కులు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మూల్యాకనం చేసిన వాళ్లకు తెలుగులో ప్రావీణ్యం ఉందా.. మెయిన్స్‌లో మార్కులు కేటాయించడానికి ఏదైనా ‘కీ’ ఉందా, ఒక ప్రశ్నకు తెలుగు, ఇంగ్లిషు, ఉర్దూల్లో రాసిన వారికి ఏ ప్రాతిపదికన మార్కులు ఇస్తారు, తెలుగులోకి వాస్తవ లేదా స్వేచ్ఛా అనువాదం 2రకాలుగా ఉంటే అందులో దేనిని ప్రామాణికంగా తీసుకుంటారు.. వంటి వివరాలు గురువారం జరిగే విచారణలో చెప్పాలని టీజీపీఎస్పీని జస్టిస్ ఆదేశించారు.
కీ పద్ధతి ఎక్కడా లేదు: టీజీపీఎస్సీ
వివరణాత్మక సమాధానాలు ఉంటాయి కాబట్టి కీ ఉండదని టీజీపీఎస్సీ తరఫు అడ్వొకేట్ రాజశేఖర్ కోర్టుకు వివరించారు. వివరణాత్మక ప్రశ్నలకు కీ ఇచ్చే పద్ధతి ఇప్పటివరకు ఎక్కడా లేదన్నారు. మూల్యాంకనం చేసే వారి వివరాలు కూడా తమ వద్ద ఉన్నాయని పిటిషనర్ల తరఫు లాయర్లు చెప్పడంపై అనుమానాలు లేవనెత్తారు. విద్యాశాఖ, సర్వీస్ కమిషన్ల వద్ద మాత్రమే ఉండాల్సిన రహస్య వివరాలు వాళ్లకెలా వచ్చాయని రాజశేఖర్ ప్రశ్నించారు. ఈ విషయంపైనా విచారణ కోరాల్సి ఉందన్నారు.
4 సెంటర్లలోనే ఎక్కువ మంది ఎట్ల పాసయ్యారు: పిటిషనర్లు
తొలుత పిటిషనర్ల తరఫు సీనియర్ అడ్వకేట్లు సురేందర్‌రావు, జి.విద్యాసాగర్ వాదిస్తూ, 2022 నోటిఫికేషన్ ప్రకారం మొత్తం ఖాళీలు 503 ఉన్నాయన్నారు. అనంతరం ప్రభుత్వం అదనంగా ఏర్పడిన 60 ఖాళీల భర్తీకి ప్రభుత్వం జీవో 16 జారీ చేసిందన్నారు. దీంతో టీజీపీఎస్సీ 2022 నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ అదనంగా వచ్చిన పోస్టులతో కలిపి 563 పోస్టులకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశం లేకపోయినా రెండింటికీ కలిపి ఒకే నోటిఫికేషన్ జారీ చేసిందని, అలా ఒక నోటిఫికేషన్‌ను రద్దు చేసే అధికారం టీజీపీఎస్సీకి లేదని వాదనలు వినిపించారు.
ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు వేర్వేరుగా హాల్‌టికెట్ నంబర్లను కేటాయించడం చట్ట విరుద్ధమని అన్నారు. కేవలం నాలుగు సెంటర్లలో రాసినవాళ్లకే ఎక్కువ మార్కులు వచ్చాయన్నారు. 16, 17, 18, 19 సెంటర్లలో 74 శాతం మంది అర్హత సాధించగా మిగిలిన సెంటర్లలో 5 శాతం కంటే తక్కువమందే అర్హత సాధించారన్నారు.
45 అని చెప్పి 46 సెంటర్లలో పరీక్షలు పెట్టారెందుకు..
కోఠి మహిళా కళాశాల అయినందున అక్కడ మహిళలనే కేటాయించామని టీజీపీఎస్సీ చెప్తోందని, అలాగైతే అదే విధానాన్ని మిగిలిన 9 మహిళా కాలేజీలకు ఎందుకు వర్తింపజేయలేదని పిటిషనర్ తరఫు లాయర్లు ప్రశ్నించారు. అభ్యర్థుల కేటాయింపునకు కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించామని చెప్తోందని, సాఫ్ట్‌వేర్‌లో మహిళలు, పురుషులకు వేర్వేరుగా సెంటర్లు ఎలా కేటాయిస్తుందన్నారు. 45 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని పోలీసు రక్షణ కోరుతూ లేఖ రాసి, 46 సెంట్లర్లలో పరీక్షలు పెట్టారన్నారు. మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించినవారు 21,093 అని ఒకసారి, 20,161 అని మరోసారి, 21,085 మూడోసారి.. ఇలా రకరకాలుగా టీజీపీఎస్సీ వెల్లడించడంపైనా అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు.
మొదట ఫలితాలను వెల్లడించినపుడు ప్రకటించిన మొత్తం మార్కులకు, సబ్జెక్టులవారీగా ఉన్న మార్కులు పొంతన లేకపోయేసరికి అభ్యర్థులు కూడా ప్రశ్నింస్తున్నారని కోర్టుకు తెలిపారు. అలా ఒక అభ్యర్థికి 122 మార్కులు రాగా 100 వచ్చినట్లు పేర్కొన్నారని, దీనిపై ప్రశ్నిస్తే ఉల్టా బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నారు. గ్రూప్ 1 నియామక ఉత్తర్వులు ఇవ్వరాదంటూ ఇచ్చిన ఆదేశాలను తొలగించాలంటూ టీజీపీఎస్సీ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేస్తామని సీనియర్ లాయర్ రచనారెడ్డి కోర్టుకు తెలిపారు. కోర్టు సమయం ముగిసిపోవడంతో న్యాయమూర్తి విచారణను గురువారానికి వాయిదా వేశారు.