
- హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ రద్దు చేయాలని ప్రతిపాదన
- సిగరెట్లు, టొబాకో, లగ్జరీ కార్లపై మాత్రం 40 శాతం
- సెప్టెంబర్ మొదటి వారంలో జీఎస్టీ కౌన్సిల్ భేటీ.. అందులోనే తుది నిర్ణయం
- ఇక 5 శాతం, 18 శాతం స్లాబులే ఉండే చాన్స్
- జీఎస్టీ మంత్రుల బృందం ఆమోదం
న్యూఢిల్లీ: జీఎస్టీ విధానాన్ని సవరించాలన్న కేంద్రం ప్రతిపాదనలకు ఆరుగురు సభ్యుల మంత్రుల బృందం అంగీకరించింది. 12 శాతం, 28 శాతం స్లాబులు ఎత్తేసి.. 5, 18 శాతం స్లాబులు మాత్రమే ఉంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గురువారం జరిగిన కీలక సమావేశంలో మంత్రుల బృందం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. ఈ ప్రతిపాదనలను జీఎస్టీ కౌన్సిల్‌కు పంపిస్తామని మంత్రుల బృందం కన్వీనర్, బిహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ప్రకటించారు. అంతకుముందు కేంద్రం ప్రపోజల్స్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంత్రుల బృందానికి వివరించారు. గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ తీసుకున్న నిర్ణయంతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరట లభించనున్నది. 12 శాతం స్లాబ్‌లోని 99% వస్తువులు 5 శాతం స్లాబ్‌లోకి వెళ్తాయి. అదేవిధంగా, 28 శాతం స్లాబ్‌లోని 90% వస్తువులు 18 శాతం స్లాబ్‌లోకి మారుతాయి. ఇక్కడ సెస్ వంటి అడిషనల్ ట్యాక్స్‌లు ఉండవు. బట్టలు, ఫుడ్, నిత్యావసర సరుకులు, బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టికెట్లు, హోటల్స్‌లో అద్దె గదుల ధరలు తగ్గుతాయి. దీంతో పాటు సిన్ గూడ్స్ (హానికర ఉత్పత్తులు)పై 40 శాతం జీఎస్టీకి మంత్రుల బృందం ఆమోదం తెలిపింది. సిగరెట్లు, ఏరేటెడ్ డ్రింక్స్, తంబాకు ప్రొడక్ట్స్, అల్ట్రా లగ్జరీ కార్లు, బైక్‌లు, ఆన్‌లైన్ గేమింగ్స్‌పై 40 శాతం పన్ను విధించడం కూడా కేంద్ర ప్రతిపాదనలో ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలో జీఎస్టీ కౌన్సిల్ భేటీ కానున్నది. ఈ సమావేశంలో జీఎస్టీ స్లాబ్‌ల తగ్గింపుపై తుది నిర్ణయం ప్రకటిస్తారు. కాగా, ఇప్పుడున్న జీఎస్టీ స్లాబుల్లో 18 శాతం చాలా కీలకం. జీఎస్టీ వసూళ్లలో ఈ ఒక్క స్లాబు నుంచి వచ్చే ఆదాయం వాటానే 65 శాతంగా ఉన్నది.
హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ప్రత్యేక చర్చ
హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ మినహాయింపు అంశంపై మంత్రుల బృందం ప్రత్యేకంగా చర్చించింది. ప్రస్తుతం వీటి ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. ఒకవేళ జీఎస్టీని ఎత్తేస్తే ఏడాదికి సుమారు రూ.9,700 కోట్ల భారం (సెంటర్, రాష్ట్రాల మధ్య షేర్) పడుతుంది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ ఎత్తేయాలని ప్రతిపాదించింది. కాగా, ఇటీవల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ మంత్రుల భేటీలోనూ ఈ అంశంపై చర్చించారు. బిహార్, తెలంగాణ జీరో జీఎస్టీకి మద్దతివ్వగా.. మిగిలిన రాష్ట్రాలు మాత్రం నష్టాలపై ఆందోళన వ్యక్తం చేశాయి.
తుది నిర్ణయం జీఎస్టీ కౌన్సిల్‌దే: సామ్రాట్ చౌదరి
జీఎస్టీ సంస్కరణల విషయంలో కేంద్రం ప్రతిపాదనలకు ఆమోదం తెలిపామని ఆరుగురు సభ్యుల మంత్రుల బృందం కన్వీనర్, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి తెలిపారు. భేటీ ముగిశాక ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘12, 28 శాతం స్లాబులు ఎత్తేసి 5, 18 శాతం స్లాబులే ఉంచాలని జీఎస్టీ కౌన్సిల్‌కు రికమండ్ చేస్తున్నాం. తమ ప్రతిపాదనలకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపితే.. పేద, మధ్య తరగతి ప్రజలు, రైతులు ఉపయోగించే రోజువారీ వస్తువుల ధరలు తగ్గుతాయి. ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. 2 స్లాబుల ప్రతిపాదనపై కొన్ని రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు కూడా ఎదురయ్యాయి. ప్రస్తుతం మేము జీఎస్టీ కౌన్సిల్ కు స్లాబ్స్ రద్దు గురించి రికమెండేషన్ చేస్తున్నాం. దానిపై తుదినిర్ణయం జీఎస్టీ కౌన్సిల్ తీసుకుంటుంది’’అని సామ్రాట్ చౌదరి వెల్లడించారు.
నష్టంపై భరోసా ఇవ్వాలి: చంద్రిమా భట్టాచార్య
2 స్లాబులతో ఆయా రాష్ట్రాలకు కలిగే నష్టాల గురించి కేంద్ర ప్రభుత్వం తన ప్రతిపాదనలో ప్రస్తావించలేదని బృందంలోని సభ్యురాలైన బెంగాల్ ఫైనాన్స్ మినిస్టర్ చంద్రిమా భట్టాచార్య అన్నారు. ‘‘ప్రజలకు అనుకూలంగా స్లాబులు తగ్గించడానికి మేము ఒప్పుకున్నాం. కానీ.. దానివల్ల ఆయా రాష్ట్రాలకు కలిగే నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు మళ్లీ ప్రజలపై ఆ రాష్ట్రాలు పన్నులు విధిస్తాయి. దీనిపై జీఎస్టీ కౌన్సిల్ స్పష్టత ఇవ్వాలి’’అని చంద్రిమా డిమాండ్ చేశారు. రాష్ట్రాల ఆదాయాలను రక్షిస్తూనే.. జీఎస్టీ స్లాబులు తగ్గించాలని గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ సభ్యుడు, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కేంద్రాన్ని కోరారు. లేనిపక్షంలో పేద, మధ్య తరగతి ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రభావం పడుతుందని తెలిపారు. స్లాబుల తగ్గింపు నిర్ణయాన్ని తెలంగాణ స్వాగతిస్తున్నదని చెప్పారు. ఈ భేటీలో యూపీ ఫైనాన్స్ మినిస్టర్ సురేశ్ కుమార్, రాజస్థాన్ హెల్త్ మినిస్టర్ గజేంద్ర సింగ్, కర్నాటక రెవెన్యూ మినిస్టర్ క్రిష్ణ బైరే గౌడ, కేరళ ఫైనాన్స్ మినిస్టర్ కేఎన్ బాలగోపాల్ పాల్గొన్నారు.
28% నుంచి 18%కి తగ్గిస్తే.. తగ్గే ధరలు ఇవే..
28 శాతం స్లాబులోని వస్తువులన్నీ 18 శాతం స్లాబులోకి వస్తే ఫోన్లు, కంప్యూటర్లు, వాషింగ్ మెషిన్స్, ఎయిర్ ప్యూరిఫయర్స్, ప్రింటర్స్ వంటి ధరలు తగ్గుతాయి. మానిటర్స్, ప్రొజెక్టర్స్, సెట్-టాప్ బాక్సెస్, డిజిటల్ కెమెరాలు, వీడియో రికార్డర్స్, వీడియో గేమ్ కన్సోల్స్, స్పీకర్స్, హెడ్‌ఫోన్స్, ఫ్యాన్స్, గ్రైండర్స్, మిక్సర్స్, వాటర్ హీటర్స్, హెయిర్ డ్రైయర్స్, ఎలెక్ట్రిక్ ఐరన్స్ ధరలు దిగొస్తాయి.
తగ్గనున్న రేట్లు!
12 శాతం స్లాబులోని వస్తువులన్నీ 5 శాతం స్లాబ్‌లోకి మారిస్తే.. ప్రధానంగా వెన్న, నెయ్యి, బాదం, నట్స్, సీడ్స్, బిస్కెట్స్, ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రూట్ జ్యూస్, వెజిటబుల్/ఫ్రూట్ ప్రిపరేషన్స్, డ్రై ఫ్రూట్స్ ధరలు తగ్గుతాయి. రోజూ ఉపయోగించే టూత్‌పేస్ట్, సోప్, హెయిర్ ఆయిల్, పేపర్, బుక్స్, పెన్స్, పెన్సిల్స్ ధరలు దిగివస్తాయి. అదేవిధంగా బట్టలు, బూట్లు, చెప్పుల ధరలు తగ్గుతాయి. సైకిళ్లు, ఛత్రీలు, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ధరలు దిగొస్తాయి.
ప్రస్తుతం ఉన్న స్లాబులు ఇలా..
- జీఎస్టీలో ప్రస్తుతం 5, 12, 18, 28 శాతం స్లాబులున్నాయి. ఇవి కాకుండా 0%, స్పెషల్ రేట్స్ (సెస్ సహా) ఉన్నాయి.
- జీరో శాతం స్లాబులో పాలు, గుడ్లు, తాజా కూరగాయలు, పండ్లు, ఉప్పు, గ్రెయిన్స్, మెడికల్ సర్వీసులు వంటివి వస్తాయి.
- 5 శాతం స్లాబులో రోజువారీ అవసరాలైన చక్కెర, టీ, కాఫీ, ఎడిబుల్ ఆయిల్, స్పైసెస్, ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్, కొన్ని మెడిసిన్స్ వస్తాయి.
- 12 శాతం స్లాబులో స్టాండర్డ్ గూడ్స్ వస్తాయి. అందులో బట్టర్, నెయ్యి, ప్రాసెస్డ్ ఫుడ్, మొబైల్స్, కంప్యూటర్స్, సైకిళ్లు, రెడీమేడ్ గార్మెంట్స్ (రూ.వెయ్యిపైన), ఫుట్‌వేర్ (రూ.500పైన) వస్తాయి.
- 18 శాతం స్లాబులో ఎలక్ట్రానిక్స్, సర్వీసెస్ వస్తాయి. వీటిలో క్యాపిటల్ గూడ్స్, ఐటీ సర్వీసెస్, హోటల్ రూమ్స్, కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి.
- 28 శాతం స్లాబ్‌లో లగ్జరి, సిన్ గూడ్స్ వస్తాయి. కార్లు, ఏసీలు, టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్స్, సిమెంట్, పెయింట్స్, పెర్ఫ్యూమ్స్, టొబాకో, ఏరేటెడ్ డ్రింక్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని వస్తువులపై కాంపెన్సేషన్ సెస్ విధిస్తారు. జీఎస్టీ అమలుతో రాష్ట్రాలకు వాటిల్లుతున్న నష్టాలను భర్తీ చేయడానికే ఈ సెస్సు వేస్తున్నారు.