- ప్రజాధనంతో అమలుచేసే పథకాలకు రాజకీయ రంగు సరికాదు: హైకోర్టు
- కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై మధ్యంతర ఉత్తర్వుల సవరణ
- దివ్యాంగ యువతులకు పథకాల ప్రయోజనం కొనసాగింపునకు అనుమతి
- కౌంటర్ దాఖలు చేయని రాష్ట్రం..సింగిల్ జడ్జి ఆర్డర్‌పై ప్రభుత్వం అప్పీల్
హైదరాబాద్, వెలుగు: సంక్షేమ పథకాల కింద ప్రజాధనాన్ని పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యేలకు ఏ అధికారం ఉందని హైకోర్టు ప్రశ్నించింది. లబ్ధిదారులను గుర్తించి, ప్రభుత్వ నిధులను చట్టబద్ధంగా పంపిణీ చేసే బాధ్యత పూర్తిగా అధికార యంత్రాంగానిదేనని స్పష్టం చేసింది. ప్రజాధనంతో అమలు చేసే సంక్షేమ పథకాలకు రాజకీయ రంగు పులమడం సరికాదని అభిప్రాయపడింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుకు సంబంధించి గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సోమవారం స్వల్పంగా సవరించింది.
దివ్యాంగుల పిల్లలకు ఈ పథకాల అమలుకు అనుమతిచ్చింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద దివ్యాంగ యువతులకు అందించే ఆర్థిక సాయానికి సంబంధించి కోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవరించింది. దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక చట్టపరమైన రక్షణ ఉన్నందున, వారికి సాయం అందించేందుకు ఉద్దేశించిన ప్రభుత్వ జీవో 4పై విధించిన మధ్యంతర స్టే ఆంక్షలను ఎత్తివేసింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుకు ప్రభుత్వం 2014 నుంచి జారీ చేసిన 8 ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ వ్యక్తిగత హోదాలో దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎన్. వెంకట శ్రవణ్‌కుమార్ సోమవారం మరోసారి విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్‌ను ప్రతివాదులుగా చేర్చాలని వారి తరఫు న్యాయవాదులు కోరారు. దీనిపై న్యాయమూర్తి తీవ్రంగా స్పందిస్తూ, ప్రజాధనాన్ని పంపిణీ చేసే అధికారం ఎమ్మెల్యేలకు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. చెక్కులను పంపిణీ చేయడానికి వారికి ఎవరు అధికారం ఇచ్చారని, దీనికి సంబంధించి ఏదైనా చట్టం లేదా నిబంధన ఉందా? అని ప్రశ్నించారు.
చట్టబద్ధమైన ఆధారం ఉండాలి
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఎమ్మెల్యేలు సంతకం చేయాలని ప్రభుత్వ ఉత్తర్వు 25లో పేర్కొన్నారని, ఆ ఉత్తర్వును ఏ న్యాయస్థానం రద్దు చేయలేదని ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు వాదించారు. తమ నియోజకవర్గాల్లో ప్రజలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించేందుకు ఎమ్మెల్యేలను ప్రతివాదులుగా చేర్చాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ప్రభుత్వ నిధుల వినియోగానికి చట్టబద్ధమైన ఆధారం ఉండాలన్నారు.
నిధుల వినియోగానికి సంబంధించిన చట్టాలు, శాసనపరమైన అనుమతులు, గవర్నర్ ఆమోదంలాంటి ప్రక్రియలు ఉంటాయని, ఈ వ్యవహారంలో అలాంటి చట్టబద్ధమైన ఆధారం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలను అమలు చేయవద్దని తాము చెప్పడం లేదని, ప్రజాధనం నుంచి ఖర్చు చేసే ప్రతి పైసాకు చట్టపరమైన లేదా శాసనపరమైన మద్దతు ఉండాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనం అందాలని, అయితే ప్రజాధనాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించకూడదన్నదే కోర్టు అభిప్రాయమని చెప్పారు. అనాథ బాలలు, మహిళలు, నిరాశ్రయులు ఎంతోమంది వీధుల్లో ఉన్నారని, కొందరికి కనీసం ఆధార్ కార్డు కూడా లేని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. అలాంటి వారికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదా అనే సందేహాన్ని లేవనెత్తారు.
ఆర్థిక పరిస్థితిపై ప్రశ్నలు
సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ఆర్థిక ప్రాధాన్యాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొన్నది. ప్రభుత్వం చెల్లించాల్సిన వివిధ బకాయిలను పెండింగ్‌లో ఉంచి, ఇలాంటి పథకాలకు పెద్ద ఎత్తున నిధులు ఎలా కేటాయిస్తోందని ప్రశ్నించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులు, భూసేకరణకు గురైన వారికి చెల్లించాల్సిన పరిహారం తదితర అంశాలపై కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని గతంలో ఆదేశించిన విషయాన్ని గుర్తుచేసింది.
భూములు కోల్పోయిన బాధితులు 8 నెలలుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారని, దేశ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతుల పాత్ర కీలకమని వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లోని అంశాలపైనా చర్చ జరిగింది. సోషల్ మీడియాలోని వివరాలను తొలగించడం కాదని, ఆ సైట్‌ను రద్దు చేయాలని పిటిషనర్ న్యాయవాది కోరగా.. అందుకు కోర్టు నిరాకరించింది. అభ్యంతరకరమైన అంశాలపై ఫిర్యాదు చేసుకోవచ్చని చెప్పింది.
జైలులో ఉన్న ఖైదీలకు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుందని వ్యాఖ్యానించింది. మెటా సంస్థ తరఫు న్యాయవాది కల్పించుకొని గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సోషల్ మీడియా వేదిక నుంచి తొలగించామని చెప్పారు. ప్రభుత్వం తరఫున అదనపు న్యాయవాది జనరల్ ఇమ్రాన్ వాదనలు వినిపిస్తూ, పరిహారం చెల్లింపులకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాల్సి ఉందని, రెండు వారాల్లో ప్రభుత్వ తరఫున కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. సామాజిక మాధ్యమ సంస్థలకు కూడా నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. రెండు వారాల్లోగా ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
అప్పీల్ చేసిన రాష్ట్ర సర్కార్
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై సింగిల్ జడ్జి జారీ చేసిన మధ్యంతర స్టే ఉత్తర్వులను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు దాఖలు చేసింది. ఈ పథకాలకు సంబంధించి 7 ప్రభుత్వ జీవోల అమలును నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరింది. సంక్షేమ పథకాలను సవాల్ చేస్తూ వ్యాజ్యం దాఖలు చేసే అర్హత పిటిషనర్‌కు లేదని ప్రభుత్వం తన అప్పీలులో పేర్కొన్నది.
ఇది పిల్ కాదని, ఈ అంశంపై విచారణ చేపట్టే వ్యవహారంపై అభ్యంతరం చెబుతూ రాజ్యాంగంలోని 162వ అధికరణం కింద ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలిపింది. పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల వివాహాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు అనుమతించాలని ప్రభుత్వం కోరింది. పథకాల అమలును నిలిపివేయడం వల్ల పలువురు యువతుల దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయని పేర్కొన్నది. దీంతో వారి వివాహాలు వాయిదా పడే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పింది. అప్పీల్‌ను డివిజన్ బెంచ్ విచారణ చేయనున్నది.
