
హైదరాబాద్, వెలుగు: ఏపీ, తెలంగాణ మధ్య ఆలిండియా సర్వీస్ (ఏఐఎస్) అధికారుల కేటాయింపు వివాదంపై హైకోర్టు కొత్త ప్రతిపాదన చేసింది. పదేండ్లుగా నలుగుతున్న ఈ వివాదాన్ని పరిష్కరించాలని కేంద్రాన్ని కోరుతామని చెప్పింది. క్యాట్ ఆదేశాలను పక్కనపెట్టి, పదేండ్ల సర్వీస్‌ను కూడా పరిగణనలోకి తీసుకుని కేటాయింపులు చేయాలని కోరుతామని తెలిపింది.
ప్రత్యూష్ సిన్హా అడ్వైజరీ కమిటీ గైడ్‌లైన్స్ మేరకే విచారణ చేస్తామని పేర్కొంది. మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ ను ఏపీ కేటాయించడం కరెక్టేనని ఇదే హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇతర అధికారులకు కూడా దాదాపుగా అదే తీర్పు వర్తిస్తుందని తెలిపింది. 12 మంది అధికారుల కేటాయింపు వివాదంపై క్యాట్ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కేంద్రం వేసిన పలు అప్పీళ్లపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జస్టిస్ అనిల్‌కుమార్ లతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారించింది.