నటి అషురెడ్డికి హైకోర్టు షాక్...స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరణ

నటి అషురెడ్డికి హైకోర్టు షాక్...స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరణ

హైదరాబాద్, వెలుగు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక ఎన్నారై వ్యాపారవేత్తను మోసం చేశారనే ఆరోపణలతో నమోదైన కేసులో నటి అషురెడ్డికి హైకోర్టులో ఊరట లభించలేదు. ఈ పిటిషన్‌‌పై విచారణ ముగిసేవరకు దర్యాప్తును నిలిపివేయాలని, తనపై కఠిన చర్యలు తీసుకోరాదని ఆమె కోరాగా, దీనిపై స్టే ఇచ్చిందుకు హైకోర్టు నిరాకరించింది. తన కుమారుడు వైవీ ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి మోసం చేశారంటూ హైదరాబాద్‌‌కు చెందిన వై.సత్యనారాయణమూర్తి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్‌‌ పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్‌‌ఐఆర్‌‌ను కొట్టివేయాలని కోరుతూ అషురెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌‌పై శుక్రవారం జస్టిస్‌‌ జె.శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. అడిషనల్ పబ్లిక్‌‌ ప్రాసిక్యూటర్ జితేందర్‌‌రావు వీరమల్ల వాదనలు వినిపిస్తూ అషురెడ్డిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి బ్యాంకు లావాదేవీలు స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. 

సుమారు రూ.10.5 కోట్ల నగదు ఆన్‌‌లైన్ ద్వారానే బదిలీ అయిందని కోర్టుకు వివరించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగాల్సి ఉందని, ఇప్పటికే పిటిషనర్‌‌కు పోలీసులు సీఆర్‌‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారని పేర్కొన్నారు. పిటిషనర్ తరఫు న్యావాది వాదిస్తూ అషురెడ్డిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ దర్యాప్తుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ కేసులో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ 9కి వాయిదా వేశారు.