వార్ రూం కేసు : సునీల్ కనుగోలు విచారణకు హాజరుకావాల్సిందే : హైకోర్టు

వార్ రూం కేసు : సునీల్ కనుగోలు విచారణకు హాజరుకావాల్సిందే : హైకోర్టు

కాంగ్రెస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలుకు హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ వార్ రూం కేసుకు సంబంధించి సైబర్ క్రైం పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ నెల 8న సునీల్ కనుగోలు సైబర్ క్రైం విచారణకు హాజరుకావాల్సిందేనని ఆదేశించింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 

కాంగ్రెస్ వార్ రూం కేసులో సైబర్ క్రైం పోలీసులు సీఆర్పీసీ 41ఏ నోటీసులు ఇవ్వడంపై సునీల్ కనుగోలు హైకోర్టును ఆశ్రయించారు. నోటీసులపై స్టే ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వంతో పాటు నాయకులపై అసత్య ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలపై వార్ రూంలో సోదాలు నిర్వహించిన పోలీసులు దొరికిన ఆధారాల మేరకు కేసు నమోదు చేశారు. అయితే ఆ పోస్టులతో తనకు సంబంధం లేదని సునీల్ కనుగోలు కోర్టుకు విన్నవించారు. ఎఫ్ఐఆర్లో సునీల్ కనుగోలు పేరు తొలగించాలని ఆయన తరఫు న్యాయవాది అభ్యర్థించారు. అయితే ఎఫ్ఐఆర్ లో ఏ1 నిందితుడిగా ఉన్న సునీల్ ను ప్రశ్నించేందుకు అనుమతించేలా ఆదేశించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.