- పరిశ్రమల తరలింపు, అనుసరించే
- ప్రక్రియను వివరించాలని ఆదేశం
- కేఏ పాల్, ప్రొ. పురుషోత్తమ్ రెడ్డి
- పిల్స్‌పై విచారణ
- జీవో 20 అమలుకు కట్టుబడి ఉన్నాం.. పరిశ్రమలను
- ఆవలకు తరలిస్తున్నామన్న ఏజీ
- తదుపరి విచారణ డిసెంబర్ 29కి వాయిదా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక విధానంలో భాగంగా తీసుకువచ్చిన హిల్ట్ పాలసీ అమలుపై స్టేటస్ కో(యథాతథ స్థితి కొనసాగింపు) ఆర్డర్ జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హిల్ట్‌పాలసీలో భాగం గా నవంబరు 22న ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 27ను సవాలు చేస్తూ ప్రొఫెసర్ కె.పురుషోత్తం రెడ్డి.. జీవో 27లో అక్రమాలు జరిగాయని, తెరవెనుక బాగోతంపై సీబీఐ, ఈడీలతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వేర్వేరుగా పిల్స్ దాఖలు చేశారు.
వీటిపై హైకోర్టు జడ్జిలు జస్టిస్ పి.శ్యాంకోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావుతో కూడిన బెంచ్ శుక్రవారం విచారించింది. స్టేటస్ కోకు నిరాకరించిన బెంచ్.. పరిశ్రమల తరలింపుతోపాటు చట్ట ప్రకారం అనుసరించిన ప్రక్రియను వివరిస్తూ కౌంటరు దాఖలు చేయాలని సర్కారును ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. 2013లో తీసుకువచ్చిన జీవో 20 అమలుకు కట్టుబడి ఉన్నామని, భూమార్పిడిలో హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేస్తుందంటూ సర్కారు తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి హామీ ఇవ్వడంతో స్టేటస్ కో ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటిషనర్ల అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.
పిటిషనర్ పురుషోత్తమ్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది కె.వివేక్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం హిల్ట్ పాలసీని తీసుకురావడానికి ముందు పర్యావరణ ప్రభావంపై అధ్యయనం నిర్వహించలేదన్నారు. 9,295 ఎకరాల భూమిని పారిశ్రామిక జోన్ నిమిత్తం ప్రభుత్వం కేటాయించిందన్నారు. 2013లో తీసుకువచ్చిన జీవో 20 ప్రకారం అన్ని కాలుష్య పరిశ్రమలు ఔటర్ రింగ్ రోడ్డు ఆవలకు తరలించాల్సి ఉందన్నారు. దీనికి విరుద్ధంగా భూకేటాయింపులు జరపాలంటే మాస్టర్ ప్లాన్‌ను సవరించాల్సి ఉంటుందన్నారు. కేఏ పాల్ వాదనలు వినిపిస్తూ.. హడావుడిగా ప్రభుత్వం పాలసీ తీసుకువచ్చిందని, ప్రభుత్వం భూమి ప్రైవేటుపరమై ప్రజల మౌలిక అవసరాలకు అందుబాటులో లేకుండా పోతోందన్నారు. తెలంగాణ ఉద్యమంలో 1,200 మంది చనిపోయారని, వారి కుటుంబాలకు ఎకరం కూడా కేటాయించకుండా వందల ఎకరాలు బడా వ్యక్తులకు సర్కారు కట్టబెడుతోందన్నారు.
పరిశ్రమలను తరలిస్తున్నాం: ఏజీ
ప్రస్తుతం నివాస ప్రాంతాలకు సమీపంలో ఉన్న కాలు ష్య పరిశ్రమలను తరలిస్తున్నట్లు హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఔటర్ రింగు రోడ్డు అవతలికి పరిశ్రమలను తరలించాలన్న జీవో 20 లక్ష్యాన్ని నీరుగార్చే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు. ఈ జీవోకు కొనసాగింపుగానే హిల్ట్ పాలసీని తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇలా పాలసీ తీసుకువచ్చిన వెంటనే పిల్ వేయడం సరికాదన్నారు. బెంచ్ స్పందిస్తూ.. ప్రస్తుతం నివాస ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలను తరలించడానికేనన్న విషయం జీవోలో ఎక్కడ ప్రస్తావించారని ప్రశ్నించగా.. పరిశ్రమల తరలింపునకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏజీ తెలిపారు.
