ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: సీబీఐ విచారణకు హైకోర్టు నిరాకరణ

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: సీబీఐ విచారణకు హైకోర్టు నిరాకరణ

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ విచారణకు హైకోర్టు నిరాకరించింది. సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని.. సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలంటూ బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవైపు సిట్ దర్యాప్తును కొనసాగించాలంటూనే హైకోర్టు పర్యవేక్షణలో అది జరగాలని స్పష్టం చేసింది. పోలీసులు, మీడియా, సీఎంఓకు గానీ వివరాలు లీక్ చేయవద్దని హై కోర్టు తేల్చి చెప్పింది. ఒకవేళ వివరాలు లీకైతే సిట్ కు నేతృత్వం వహిస్తున్న వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పింది. కేసుకు సంబంధించి తుది నివేదికను ఈ నెల 29న సీల్డ్ కవర్ లో జస్టిస్ విజయ్ సేన్ రెడ్డికి అందజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.  ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ కేసుకు సంబంధించి దర్యాప్తు వివరాలు, సీడీని ప్రెస్ మీట్లో లీక్ చేయడంపై ప్రభుత్వ తరఫు న్యాయవాది విచారం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతంగా కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

నిందితులకు బెయిల్ తిరస్కరణ

మొయినాబాద్​ ఫాం హౌస్​ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‭ను నాంపల్లి ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం తరపు లాయర్ వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది. దర్యాప్తు సమయంలో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే కేసును, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ పై పోలీసులు పీటీ వారెంట్ కోరారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో బంజారాహిల్స్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు.

ఇదిలా ఉంటే..  నందకుమార్ పై బంజారాహిల్స్ పీఎస్ లో 2 కేసులు నమోదయ్యాయి. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడ్ని అరెస్ట్‭ చేసేందుకు  అనుమతించాలని పోలీసులు కోరారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏ2గా ఉన్న నందకుమార్.. ఇప్పటికే చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. పోలీసులు వేసిన పీటీ వారెంట్‭కు నాంపల్లి కోర్టు అనుమతిస్తే.. నిందితుడు నందకుమార్ ను అరెస్ట్ చేసి తిరిగి కోర్టులో హాజరుపర్చనున్నారు.