ఆయుష్ డాక్టర్లపై కేసులు కొట్టివేత.. తీర్పు చెప్పిన హైకోర్టు

ఆయుష్ డాక్టర్లపై కేసులు కొట్టివేత.. తీర్పు చెప్పిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: సైబరాబాద్, సంగారెడ్డిలో ఆయుష్  వైద్యులపై నమోదైన మోసం, వంచన కేసుల్లో తెలంగాణ మెడికల్  కౌన్సిల్‌‌‌‌ (టీఎంసీ) తీరును హైకోర్టు తప్పుబట్టింది. ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన తనిఖీల అనంతరం ఆయుష్  డాక్టర్లపై నమోదు చేసిన కేసులను హైకోర్టు రద్దు చేసింది. చట్టవిరుద్ధంగా అల్లోపతి వైద్యం అందిస్తున్నారని టీఎంసీ ఫిర్యాదు చేయడంతో ఆయుష్  వైద్యులపై పోలీస్  కేసులు నమోదయ్యాయి. 

వాటిని సవాలు చేస్తూ లోకేశ్‌‌‌‌తో పాటు ఇతర వైద్యులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల అడ్వొకేట్  వాదిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి టీఎంసీకి అధికారం లేదని, ఈ హక్కు ఆయుష్  కమిషనర్‌‌‌‌కే ఉందన్నారు. అలాగే భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌‌‌‌ఎస్‌‌‌‌) సెక్షన్లు 318, 319 కింద నేరం నిరూపించడానికి అవసరమైన ఆధారాలు లేవన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ.. ఆయుష్  వైద్యులు  నిబంధనలకు విరుద్ధంగా అల్లోపతి చికిత్స చేస్తున్నారని చెప్పారు. 

ఇరువైపుల వాదనలు విన్న జడ్జి జస్టిస్‌‌‌‌  ఎన్‌‌‌‌.తుకారాంజీ.. టీఎంసీకి ఈ కేసుల్లో జోక్యం చేసుకునే అధికారమే లేదన్నారు. కాబట్టి ఈ కేసులు కొనసాగించడానికి వీల్లేదని తేల్చారు. ఆయుష్  వైద్యుల పిటిషన్లను అనుమతించారు. టీఎంసీ కాకుండా కమిషనర్  చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకునే అధికారం ఉందన్నారు.