
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఇజ్జత్‌నగర్‌లో నమిత్ హోమ్స్ చేపట్టిన 25 అంతస్తుల 360 లైఫ్ బహుళ అంతస్తుల నిర్మాణాన్ని కొనసాగించడానికి అనుమతిస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను సవరిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ లేవనెత్తిన లోపాలను సరిదిద్దాలని, అనుమతుల ప్రకారం నిర్మాణం చేపట్టాలని ఆదేశించింది.
నమిత హోమ్స్‌కు అనుమతులను పునరుద్ధరిస్తూ జూన్ 11న జీహెచ్‌ఎంసీ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ అందులో భాగస్వామిగా ఉన్న ఎర్రం విజయ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కె.వివేక్‌రెడ్డి వాదిస్తూ..2 బేస్‌మెంట్‌లు, 3 సిల్ట్‌లు, 24 అంతస్తులకు అనుమతులు తీసుకున్నారన్నారు. అయితే, 4 సిల్ట్‌లతోపాటు 28 అంతస్తుల నిర్మాణం చేపట్టారన్నారు. వాస్తవానికి 75 మీటర్ల ఎత్తుకు అనుమతులుంటే 86 మీటర్లు నిర్మిస్తున్నారన్నారు.
నమిత హోమ్స్ తరఫు సీనియర్ న్యాయవాది రవికిరణ్‌రావు వాదిస్తూ..24 అంతస్తుల నిర్మాణం చేపట్టేదాకా పిటిషనర్ ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు. 1100 మంది పనిచేస్తున్నారని, రూ.400 నుంచి రూ. 500 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. నిర్మాణంలో జాప్యం జరిగితే కొనుగోలుదారులు నష్టపోతారన్నారు. వ్యాపార విభేదాలతో ఫిర్యాదులు చేశారన్నారు. జీహెచ్‌ఎంసీ చెప్పిన లోపాలను సవరించడానికి అవకాశం ఉందన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరిస్తూ జీహెచ్‌ఎంసీ అనుమతుల మేరకు నిర్మాణం చేపట్టాలంటూ నమిత హోమ్స్‌కు ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.