- లాయర్ దంపతుల హత్య కేసులో పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: పట్టపగలు నడిరోడ్డుపై అడ్వకేట్ దంపతులు గట్టు వామన్ రావు, నాగమణిలను దారుణంగా హత్య చేసిన ఘటనలో ఎవ్వరినీ వదిలిపెట్టొద్దని పోలీసులకు హైకోర్టు తేల్చిచెప్పింది. హత్య జరిగిన చోట ఎంతో మంది ప్రయాణికులు ఉన్నా, కొంత మందినే సాక్షులుగా నమోదు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అడ్వకేట్ల హత్యపై హైకోర్టు సుమోటోగా స్వీకరించిన కేసుతో పాటు వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు దాఖలు చేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది. ‘‘పట్టపగలు కిరాతకంగా హత్యలు చేశారు. ఇరవై నిమిషాల వరకూ ట్రాఫిక్ స్తంభింపచేసి మరీ దారుణానికి ఒడిగట్టారు. ప్రజాహిత వ్యాజ్యాలు వేసిన లాయర్ల హత్యను తీవ్రంగా పరిగణించాలి. హత్య జరుగుతున్నప్పుడు అక్కడే ఆగిన మూడు ఆర్టీసీ బస్సుల్లో, ఇతర వాహనాల్లో చాలా మంది ప్రయాణికులు ఉండగా, 25 మందిని మాత్రమే సాక్షులుగా నమోదు చేయడం ఏమిటి?” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఫోరెన్సిక్ రిపోర్టుకు 4 వారాలు
తొలుత అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదిస్తూ.. కుంట శ్రీను (ఏ1), చిరంజీవి (ఏ2), కుమార్ (ఏ3)ల స్టేట్‌మెంట్లను మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేశామన్నారు. ఏ4, ఏ5లు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని, ఏ6 పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ఏ7ను అరెస్ట్ చేశారని తెలిపారు. లాయర్ల హత్యకు వాడిన కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. 25 మంది సాక్షుల్లో19 మంది సాక్ష్యాలను నమోదు చేశామన్నారు. నిందితుల ఫోన్లు సీజ్ చేసి డేటా సేకరిస్తున్నారని తెలిపారు. సీసీ ఫుటేజీ, మొబైల్ ఫోన్ల క్లిప్పింగ్ లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని, 4 వారాల్లో రిపోర్టు వస్తుందని చెప్పారు. పోలీసులు సమర్పించిన రిపోర్టును పరిశీలించి, వాదనలను విన్న హైకోర్టు.. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాత చార్జిషీట్ దాఖలు, ఇతర చర్యలపై మరో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసింది.
