అవిశ్వాస తీర్మానాలపై స్టేకు హైకోర్టు నిరాకరణ

అవిశ్వాస తీర్మానాలపై స్టేకు హైకోర్టు నిరాకరణ
  •      ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ చైర్మన్లు, వైస్‌‌ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాల అమలును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు విన్న తర్వాతే తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పింది. ప్రతివాదులైన మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. విచారణను వాయిదా వేస్తూ జస్టిస్‌‌ వినోద్‌‌ కుమార్‌‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

భువనగిరి మున్సిపల్‌‌ చైర్మన్, వైస్‌‌ చైర్మన్లు ఆంజనేయులు, సీహెచ్‌‌.కిష్టయ్య, కాగజ్‌‌నగర్‌‌ మున్సిపల్‌‌ చైర్​పర్సన్ మహ్మద్ సద్దాం హుస్సేన్‌‌ అవిశ్వాస తీర్మాన నోటీసులను సవాల్‌‌ చేశారు. అవిశ్వాస తీర్మానాల నోటీసులపై స్టే ఇవ్వాలన్న వాళ్ల వినతులను జస్టిస్ వినోద్ కుమార్ తోసిపుచ్చారు. అదేవిధంగా, తనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి.. చైర్మన్​గా అబ్బగోని రమేశ్​ను నియమించడాన్ని సవాల్‌‌ చేస్తూ నల్గొండ మున్సిపల్‌‌ మాజీ చైర్మన్‌‌ మందాడి పైదిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన జడ్జి.. ఆ జిల్లా కలెక్టర్, ఆర్డీవో, రమేశ్​తో పాటు ప్రభుత్వానికి నోటీసులిచ్చారు.