మున్సిపల్ అవిశ్వాసాలపై స్టేకు హైకోర్టు నో

మున్సిపల్ అవిశ్వాసాలపై స్టేకు హైకోర్టు నో
  •      రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ
  •     విచారణ ఈ నెల 29కి వాయిదా

హైదరాబాద్, వెలుగు : వివిధ మున్సిపాల్టీల చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాల నోటీసులను సవాల్‌‌‌‌ చేసిన కేసుల్లో హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రభుత్వ వాదనలు విన్న తర్వాతే తగిన మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని ప్రకటించింది. ప్రతివాదులైన మున్సిపల్‌‌‌‌ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్లతో పాటు సంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి–భువనగిరి, జనగాం కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది.

తెలంగాణ మున్సిపల్‌‌‌‌ యాక్ట్‌‌‌‌–2019లోని సెక్షన్‌‌‌‌ 37లో అవిశ్వాస తీర్మానం ఆమోదించడానికి సంబంధించిన విధివిధానాలు లేవంటూ సదాశివపేట, ఆందోల్‌‌‌‌–జోగిపేట, జవహర్‌‌‌‌ నగర్, జనగాం, ఆలేరు మున్సిపల్‌‌‌‌ చైర్మన్లు దాఖలు చేసిన అప్పీళ్లను చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ అలోక్‌‌‌‌ అరాధే, జస్టిస్‌‌‌‌ అనిల్‌‌‌‌కుమార్‌‌‌‌ డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ మంగళవారం విచారించింది. సదాశివపేట చైర్పర్సన్‌‌‌‌ పి.జయమ్మ, జనగాం చైర్పర్సన్‌‌‌‌ పి.జమున, ఆందోల్‌‌‌‌–జోగిపేట చైర్మన్‌‌‌‌ జి.మల్లయ్య. జవహర్‌‌‌‌ నగర్‌‌‌‌ మున్సిషల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ చైర్​పర్సన్‌‌‌‌ ఎం.కావ్య, ఆలేరు మున్సిపల్‌‌‌‌ చైర్పర్సన్‌‌‌‌ వి.శంకరయ్య దాఖలు చేసిన అప్పీల్‌‌‌‌పై విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

తెలంగాణ మున్సిపల్‌‌‌‌ చట్టం–2019 సెక్షన్‌‌‌‌ 37లో అవిశ్వాస తీర్మానం ఆమోదానికి విధి విధానాలు లేవని పిటిషనర్ల వాదన. కొందరు కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన వినతి పత్రాల మేరకు సమావేశాలు నిర్వహించేలా ఆయా జిల్లాల కలెక్టర్లు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని కోరారు. అప్పీళ్లపై విచారణ ముగిసేదాకా అవిశ్వాస తీర్మానాలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరించిన హైకోర్టు, నాలుగు రోజుల్లో మార్పులు ఏమీ ఉండబోవని, ప్రతివాదుల వాదనల తర్వాతే అవసరమైతే మధ్యంతర స్టే ఆదేశాలిస్తామని చెప్పింది. విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.