
రాష్ట్ర సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
విచారణ వచ్చే నెల 5కు వాయిదా
హైదరాబాద్, వెలుగు: లేఅవుట్ల రెగ్యులరైజేషన్ కోసం రాష్ట్ర సర్కార్ ఆగస్టు 31న జీవో 131 జారీ చేయడం చట్ట వ్యతిరేకమని పేర్కొంటూ దాఖలైన పిల్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన కె.ప్రసాదరావు వేసిన ఈ పిల్‌ను సోమవారం చీఫ్ జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిల బెంచ్ విచారించింది. ప్రతివాదులైన సీఎస్, మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్/పంచాయతీరాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులు, మున్సిపల్, హెచ్‌ఎండీఏ, టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్లు తమ వాదనలతో కౌంటర్ పిటిషన్ వేయాలని నోటీసులు ఇచ్చింది. రెగ్యులరైజేషన్ గడువును సర్కార్ ఈ నెలాఖరు వరకూ పొడిగించినట్లు హైకోర్టు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పిటిషనర్ న్యాయవాది చెప్పారు. అసలే కరోనా, ఇప్పుడు వరదలతో జనం అల్లాడిపోతుంటే ఈ నెలవరకూ గడువు ఎలా సరిపోతుందని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయాన్ని సర్కార్ దృష్టికి తీసుకువెళ్తానని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. వాదనల అనంతరం హైకోర్టు.. అక్రమ లేఅవుట్ల రెగ్యులరైజేషన్ గతంలో దాఖలైన పిల్స్‌తో దీనిని కూడా జత చేసి నవంబర్ 5న విచారిస్తామని ప్రకటించింది.
For More News..