రాష్ట్ర సర్కార్​పై హైకోర్టు ఆగ్రహం

రాష్ట్ర సర్కార్​పై హైకోర్టు ఆగ్రహం

రాష్ట్ర సర్కార్​పై హైకోర్టు ఆగ్రహం
రూ.25 వేలు కడితేనే వాయిదా వేస్తం
మళ్లీ గడువు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం

హైదరాబాద్, వెలుగు: ‘‘ఒకటి.. కాదు రెండు కాదు.. ఏకంగా 15 ఏండ్లుగా కౌంటర్‌ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి తీరిక లేదా..?  గతంలోనే కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తే అదేపనిగా వాయిదా కోరడం ఏంటి..? కచ్చితమైన ఆదేశాలిచ్చినా మళ్లీ గడువు కోరడంలో ఆంతర్యం ఏమిటి? ఈసారి వాయిదా వేయాలంటే కోర్టు ఖర్చుల కింద ప్రభుత్వం రూ.25 వేలు చెల్లించాలి. అప్పుడే వాయిదా వేసేందుకు అనుమతిస్తాం. మరి రూ.25 వేలు చెల్లిస్తారా?” అంటూ జీవో 111కు సంబంధించిన పిటిషన్‌ విచారణ టైంలో ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ రిజర్వాయర్ల పరిరక్షణ కోసం గతంలో జారీ చేసిన జీవో 111ను అమలు చేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ పర్యావరణవేత్త జీవానంద్‌రెడ్డి 2007లో పిల్‌ దాఖలు చేశారు. జీవో 111 వివాదం సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఉండగానే ప్రభుత్వం ఆ జీవోను  ఎత్తేస్తూ మరో జీవో 69 జారీ చేసిందని, దీన్ని కొట్టేయాలంటూ జీవానంద్​ రెడ్డి.. ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డితో కూడిన డివిజన్‌ బెంచ్‌ సోమవారం విచారించింది. 

సుప్రీం కోర్టుకు జీవో 111 వివాదం
కౌంటర్‌ దాఖలు చేసేందుకు మూడు వారాల టైం కావాలని ప్రభుత్వం కోరడంపై డివిజన్‌ బెంచ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తే కౌంటర్‌ వేయకుండా ఉదాసీనంగా ఉంటారా..? అని ప్రశ్నించింది. ఈసారికి మాత్రం వాయిదా వేస్తామని ప్రకటించింది. మళ్లీ గడువు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. పిటిషనర్‌ తరఫు సీనియర్‌ అడ్వొకేట్​ కేఎస్‌ మూర్తి వాదిస్తూ.. రెండు రిజర్వాయర్ల పరిధిలో 10 కి.మీ మేరకు ఏవిధమైన నిర్మాణాలు చేయకూడదన్నారు. జీవో 111 వివాదం సుప్రీం కోర్టుకు కూడా చేరిందని, ఇలాంటి పరిస్థితుల్లో జీవోను రద్దు చేస్తూ మరో జీవో 69 జారీ చేసిందన్నారు. ఏజీ ఆఫీస్‌ అసిస్టెంట్‌ అడ్వొకేట్‌ పి.ఉష వాదిస్తూ.. కౌంటర్‌ వేసేందుకు 3 వారాల గడువు కావాలని కోరడంతో బెంచ్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. 15 ఏండ్లుగా కౌంటర్‌ వేయకుండా వాయిదాల మీద వాయిదాలు కోరడం ఏంటని ప్రశ్నించింది. ఈ దశలో హెచ్​ఎండీఏ అడ్వొకేట్‌ వై.రామారావు జోక్యం చేసుకుని.. జీవో 111ను సవాల్‌ చేసిన రిట్లతో పాటు ఆ జీవోను రద్దు చేయాలని కోరుతూ కూడా రిట్లు దాఖలయ్యాయని చెప్పారు. జీవో 69 విషయంలో దాఖలైన ఇంప్లీడ్‌ పిటిషన్‌ కూడా ఉందన్నారు. జీవో 111 పరిధిలోకి 84 గ్రామాలను అశాస్త్రీయంగా తెచ్చారని, అందుకే జీవో 69 జారీ చేయాల్సివచ్చిందన్నారు. దీంతో 3 వారాల గడువు ఇస్తూ విచారణను హైకోర్టు వాయిదా వేసింది.