
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ఓల్డ్ సిటీలో మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణ పనులపై హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందంటూ జరుగుతున్న ప్రచారం తప్పని, హైకోర్టు ఎటువంటి స్టే ఆర్డర్ ఇవ్వలేదని మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం (june 13) ఒక ప్రకటన విడుదల చేశారు.
యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ (ఏపీడబ్ల్యూఎఫ్) దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి ప్రతిస్పందనగా హెచ్ఏఎంఎల్ హైకోర్టుకు గతంలో దాఖలు చేసిన కౌంటర్ లో, ఓల్డ్‌సిటీలో ఏ వారసత్వ నిర్మాణాన్ని తాకడం లేదా కూల్చివేయడం లేదని విన్నవించినట్టు వెల్లడించారు. చార్మినార్, ఫలక్ నుమా చారిత్రాత్మక నిర్మాణాలు మెట్రో రైల్ అలైన్మెంట్ కు దూరంగా ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నట్టు ఆయన చెప్పారు.
ఎటువంటి పురాతన కట్టడాలను, ప్రాంగణాలను తాకడం లేదా కూల్చివేసే ప్రసక్తే లేదని హెచ్ఏఎంఎల్ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ న్యాయస్థానానికి స్పష్టం చేశారని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. పిటిషనర్, హెచ్ఏఎంఎల్ అదనపు అఫిడవిట్లు, కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేశారన్నారు.
కొన్ని రోజుల కింద పిటిషనర్ దాఖలు చేసిన తాజా అదనపు అఫిడవిట్లకు అదనపు అడ్వకేట్ జనరల్ హెచ్ఏఎంఎల్ తరఫున తన ప్రతిస్పందనను దాఖలు చేయడానికి కొంత సమయం కోరారని చెప్పారు. హైకోర్టు సమగ్రమైన కౌంటర్ దాఖలు చేయడానికి మూడు వారాల సమయం ఇచ్చిందని తెలిపారు. మధ్యంతర ఆర్డర్ ఏదైనా గతంలో ఇచ్చి ఉంటే, తదుపరి విచారణ తేదీ వరకు అది అమలులో ఉంటుందని మాత్రమే హైకోర్టు తన ఉత్తర్వులలో పేర్కొందని ఆయన వివరించారు.
హైకోర్టు ఆదేశాలను వక్రీకరిస్తూ కొందరు తప్పుడు సమాచారం చేస్తున్నారని అన్నారు. ఆస్తులను నష్టపోయినవారికి సముచితమైన పరిహారం చెల్లించిన తర్వాతే ప్రైవేట్ భవనాల కూల్చివేత ఉంటుందని వివరించారు. ఓల్డ్ సిటీలో ఆస్తుల కూల్చివేతలో ఉన్న సవాళ్లను వివరిస్తూ, ఒకదానికొకటి అనుకొన్న భవనాలు, సంక్లిష్టంగా ముడిపడిన విద్యుత్, టెలికాం, ఇతర కేబుల్ వైర్లు ఉండటంతో, హెచ్ఏఎంఎల్ ఇంజినీర్లు, అధికారులు ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం లేకుండావారసత్వ కట్టడాలను మినహాయించి మిగిలిన ప్రభావిత ఆస్తులను రాత్రిపూట జాగ్రత్తగా కూల్చివేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.