
- ఎలక్షన్ జరుగుతుందనుకున్న ఆశావహుల్లో తీవ్ర నిరాశ
- ఉమ్మడి మెదక్ జిల్లాలో 12 నామినేషన్లు దాఖలు
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: అయ్యో గిట్లయిపాయె.. మంచిగ ఎలక్షన్ల నిలవడి జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ అయిదాం అనుకుంటిమి.. అన్ని రకాలుగా తయారైతే.. పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్, బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు సంబంధించిన జీవో 9పై హైకోర్టు స్టే వచ్చె.. గిట్లయితదనుకోలేదు.. అంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న నాయకులు మస్తు నారాజ్అయితుండ్రు.
జిల్లా, మండల పరిషత్ పాలకవర్గాల కాలపరిమితి పూర్తయి చాలా రోజులవుతోంది. మళ్లీ ఎన్నికలు ఎప్పుడెప్పడు వస్తాయా అని ఎంతోమంది లీడర్లు ఎదురుచూశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌స్థానాల రిజర్వేషన్లు ఖరారు కావడం, ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడంతో ఆశావహులు ఎన్నికలకు అన్ని విధాలా సిద్ధమయ్యారు. ఇంతలో కోర్టు స్టేతో వారు తీవ్ర నిరాశ చెందారు.
పరిషత్ స్థానాలకు 12 నామినేషన్లు..
గురువారం ఉదయం మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్, సిద్దిపేట కలెక్టర్హైమావతి, సంగారెడ్డి కలెక్టర్ప్రావీణ్య పరిషత్ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు జడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా బంక చిరంజీవి, ఎ.మధు, పల్లె రాజు, ఎ.శ్రీకాంత్, నారాయణరావుపేట జడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థులుగా ఎం.దేవయ్య, భర్మ రామచంద్రం, గౌటి భాలేశ్నామినేషన్వేశారు.
సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల ఎంపీటీసీ స్థానానికి బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా తుపాకుల మురళీకాంత్, రాయపోలు మండలం మంతూరు ఎంపీటీసీ స్థానానికి చంద్రశేఖర్నామినేషన్ దాఖలు చేశారు. సిద్దిపేట రూరల్ మండలం బక్రీ చెప్యాల ఎంపీటీ సీ స్థానానికి ఒకటి, సంగారెడ్డి జిల్లా కంగ్టీ జడ్పీటీసీ స్థానానికి ఒకటి, ఎంపీటీసీ స్థానానికి ఒక నామినేషన్దాఖలయ్యాయి.
పరిస్థితి తారుమారు
షెడ్యూల్ ప్రకారం మొదటి విడతలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 37 జడ్పీటీసీ, 353 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. పరిషత్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీలు మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బలమైన అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ముగ్గురు అభ్యర్థుల పేర్లతో అధిష్టానానికి జాబితా పంపింది. బీఆర్ఎస్కూడా ఆశావహుల్లో సమర్థులైన వారిని ఎంపిక చేయడంలో నిమగ్నమైంది.
బీజేపే జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ముగ్గురు పేర్లతో లిస్ట్రూపొందించే పనిలో పడింది. మొదటి విడత ఎన్నికల నామినేషన్‌కు ఈ నెల 11 వరకు గడవు ఉండగా.. ఆలోగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయడంపై మూడు పార్టీలు దృష్టి పెట్టాయి. కచ్చితంగా తమకు టికెట్ వస్తుందనుకున్న నాయకులు నామినేషన్వేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ, హైకోర్టు స్టే విధించడంతో పరిస్థితి తారుమారైంది. దీంతో ఆశావహులు ఒక్కసారిగా డీలా పడిపోయారు.
మద్దతుకు ప్రయత్నాలు.. విందులు
ఎన్నికల షెడ్యూల్వెలువడినప్పటి నుంచే జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేయాలనుకున్న ఆయా పార్టీల నాయకుల్లో కొందరు తమ ప్రాదేశిక నియోజకవర్గ పరిధిలోని పార్టీ నాయకులు, వివిధ కుల, యువజన, మహిళా సంఘాల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేశారు. కొందరు విందులు ఏర్పాటు చేశారు. మరికొందరు తమకు మద్దతు ఇస్తే వివిధ పనులకు ఆర్థిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తీరా నామినేషన్దాఖలు సమయానికి ఎన్నికల ప్రక్రియ నిలిచిపోవడంతో అవాక్కయ్యారు. ఇప్పటివరకు పెట్టిన ఖర్చంతా వృథా అయిందని బాధ పడుతున్నారు.